నో భరోసా రైతుబందే

– ఎకరాలకు రూ.5 వేలే జమ
– విధి విధానాలేవి?

– కౌలు రైతులు, భూమిలేని కూలీల గుర్తింపులో ఆలస్యం
– పట్టాదారు, కౌలుదారులో ఎవరికిస్తారో తెల్వదు
– ఎన్నికల హామీ మేరకు రూ.7,500 ఇవ్వాలనే డిమాండ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతు బంధు కింద ఎకరాలకు రూ.5 వేలు మాత్రమే పెట్టుబడి సాయం కింద ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని పెంచుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏటా ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం కింద రైతులతో పాటు కౌలు దారులకూ ఇస్తామని చెప్పారు. వీరితో పాటు భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తామన్నారు. దీంతో రైతులు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపి ఓట్లేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అమలు చేస్తారని రైతులు ఆశించారు. డిసెంబర్‌ 9 నుంచి ఆరు గ్యారంటీలన్నీ అమలు చేస్తే అందులో రైతు భరోసా కూడా ఉంటుందనుకున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వైద్యం అందించే పథకాల్ని ప్రారంభించారు. రైతులు కూడా రైతు భరోసా గురించి ఆశగా ఎదురు చూస్తున్నందున ఎన్నికల్లో చెప్పిన భరోసా కాకుండా గత ప్రభుత్వం అమలు చేసిన మాదిరే రైతు బంధు కింద ఇచ్చిన సాయాన్నే ప్రస్తుతం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు బంధు మాదిరే పెట్టుబడి సాయం
కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాల్సిన రైతు భరోసా కాకుండా రైతు బంధునే అమలు చేస్తున్నారు. కొత్త పథకం అమలు కోసం విధి విధానాలు రూపొందించేందుకు సమయం పడుతున్నందున పాత పద్దతిలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలందాయి. దీంతో ప్రస్తుత సీజన్‌కు గాను ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తున్నారు. తొలుత ఎకరా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. విడతల వారిగా రైతులకు డబ్బులు జయచేయనున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద సంగారెడ్డి జిల్లాలో 339289 మంది, మెదక్‌ జిల్లాలో 274815 మంది, సిద్దిపేట జిల్లా లో 404438 మంది రైతులు కలిపి మూడు జిల్లాల్లో 1018542 మంది రైతు బంధు లబ్ధిధారులున్నారు. వీ రందరికీ రైతు బంధు ఇస్తారా ఇవ్వరా అనేది స్పష్టతలేదు. ప్రస్తుతం మూడు జిల్లాల్లో నూ ఎకరా లోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎకరాలోపు భూమి ఉన్న 35383 మంది రైతులకు రూ.9.41 కోట్ల డబ్బుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ అధికారు లు పేర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో 40150 మందికి 11.12 కోట్లు, మెదక్‌ జిల్లాలో 18 వేల మంది రైతులకు రూ.7 కోట్ల వరకు వేసినట్లు చెబుతున్నారు. ఎకరాలకు రూ.5 వేల చొప్పున పట్టాదారుకు ఎంత భూమి ఉంటే ఆ లెక్కన డబ్బులు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని ఎకరాల వర కు పెట్టుబడి సాయం ఇస్తారనేది కూడా స్పష్టత ఇవ్వట్లేదు.
విధి విధానాలొచ్చాకే రైతు భరోసా
కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి సమయం పడుతుందంటున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉంటాయనేది తేలాల్సి ఉంది. రైతు భరోసా పథకం ద్వారా రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా కౌలు దారులు, భూమిలేని వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం ఇవ్వడానికి విధి విధానాలేమిటీ అనేది ప్రభుత్వం ప్రకటించాకనే తెలుస్తుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు పెట్టుబడి సాయం రూ.15 వేలు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. గతంలో రైతు బంధు ఇవ్వడానికి పట్టాదారులందర్నీ రైతులుగా గుర్తించి ఇచ్చారు. పరిమితి లేకుండా రైతులందరికీ పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే విషయంలో నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు ఎకరాలకు లిమిట్‌ పెట్టాలనే అభిప్రాయం ఉన్నప్పటికీ పది ఎకరాల వరకు కూడా ఇస్తే తప్పేమిలేదనే చర్చ కూడా ఉన్నది. సాగు భూములన్నిటికీ ఇవ్వాలనే డిమాండ్‌ కూడా ఉంది. ప్రభుత్వం ఆలోచన బట్టి లిమిట్‌ పెట్టే అవకాశముంది. ఇక కౌలు రైతుల గుర్తింపు కోసం కూడా మార్గదర్శకాలు రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో కౌలు రైతుల్ని గుర్తించి గుర్తింపు కార్డులిచ్చారు.
పంట రుణాలు, పంట నష్టపరిహారం అందించారు. అందు కోసం భూ యజమాని నుంచి కౌలు పత్రం పొంది ఉన్న వాళ్లను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌దే అయినందున అదే పద్దతి అనుసరిస్తారా..? లేక మరేదైన మార్గం చూస్తారా అనేది చూడాలి. రైతుకు, కౌలుదారుకూ పెట్టుసాయం ఇస్తామని చెప్పినందున భూమి ఒకటే కానీ..! పెట్టుబడి సాయం మాత్రం రెండు సార్లు ఇవ్వాల్సి వస్తుందనే చర్చ కూడా ఉంది. రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చాక అదే భూమిని కౌలుకు సాగుచేసే కౌలుదారుకు కూడా సాయం ఎలా ఇవ్వాలనేది తేలాలి. కౌలుదారుకు అంగీకార పత్రం రాసి ఇవ్వడానికి పట్టాదారులు ఇష్టపడతారాలేదా అనేది కూడా ఇబ్బందికరమైన విషయమనే చెప్పాలి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 65 వేల మంది, సిద్దిపేట జిల్లాలో 40 వేల మంది, మెదక్‌ జిల్లాలో 24650 మంది కౌలు రైతులున్నట్లు ప్రాథమికంగా ఒక అంచనా వేశారు. విధి విధానాలు ప్రకటించాక వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం రూ.12 వేలు ఇవ్వడానికి ఉపాధి జాబ్‌కార్డులున్న వాళ్లకే ఇస్తారా…లేక తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదల్ని గుర్తిస్తారా..? అనే చర్చ నడుస్తుంది.
రూ.7500 ఇవ్వాలని రైతుల అభిప్రాయం
కాంగ్రెస్‌ ప్రకటించిన మాదిరి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. యాసంగీ సీజీన్‌ డబ్బులు రూ.7500 చొప్పున జమ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే యాసంగీ సీజన్‌ పంటల సాగు పనులు జరుగుతున్నాయి. పత్తి, ధాన్యం అమ్మకాలు జరుగుతున్నా డబ్బులు చేతికొచ్చేందుకు సమయం పట్టనుంది. వరినార్లు పోశారు. నాట్లు వేసే సయం వస్తుంది. ఎరువులు, విత్తనాలు, దున్నకం కోసం పెట్టుబడి కావాల్సి ఉన్నందున రైతులు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పాత పద్దతిలో రూ.5 వేలు ఇస్తే పెంచిన డబ్బులు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లోనే రైతులకు అందే అవకాశముంది.

Spread the love