‘సహకార’మేదీ..?

'Cooperation'?– 75 సొసైటీలకు అందని రుణమాఫీ..
– నష్టపోతున్న 2 నుంచి 3 లక్షల మంది రైతులు
– రూ.502.79 కోట్లు మాఫీ కాని పరిస్థితి
– రెన్యువల్‌ చేయకపోవడమే కారణం
– ప్రభుత్వానికి నివేదికలందజేత
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (సీడెడ్‌) ఉన్న రైతులకు వర్తించలేదని సమాచారం. ప్రభుత్వం ఇచ్చిన నిర్ధిష్ట గడువు డిసెంబర్‌ 12, 2018 నుంచి డిసెంబర్‌ 12, 2023 మధ్య సంబంధిత సంఘాల్లో రుణాలను రెన్యువల్‌ చేయకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇక్కడ సుమారు 2.50 నుంచి 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. 2018-2023 మధ్య ఏ సంఘంలోనూ రుణాలు ఇవ్వలేదు. దాంతో అంతకుముందు ఇచ్చిన రుణాలను రెన్యువల్‌ చేయాలని సంఘాలపై ఎలాంటి ఒత్తిడి లేదనేది అధికార వర్గాల సమాచారం. వాణిజ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రెన్యువల్‌ చేయాలని ఉన్నతాధికారుల ఒత్తిడి నేపథ్యంలో పాత రుణాలను రెన్యువల్‌ చేయడంతో వాటికి రుణమాఫీ వర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం జులై 18న తొలిదఫాలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసింది. ఈ నేపథ్యంలో చాలా సంఘాల్లో రుణాలు మాఫీ కాలేదని తెలియడంతో రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 149 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా, ఇందులో 70 సంఘాలు మాత్రమే ఉమ్మడి వరంగల్‌ డీసీసీబీ పరిధిలో ఉన్నాయి. మిగతా 79 సంఘాలు వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌ డీసీసీబీ పరిధిలోని 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 77,288 మంది రైతులకు రూ.502.79 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. హన్మకొండ జిల్లాలోని పరకాల, సింగారం, వంగపహాడ్‌, పెగడపల్లి సంఘాల్లో రుణమాఫీ నిధులు జమ కాలేదు. ఈ నాలుగు సంఘాల్లో సుమారు 6 వేల మంది రైతులు ఆందోళనలో ఉన్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం సొసైటీలో 2,900 మంది రైతులకు రూ. లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగాల్సి వున్నా, నేటికీ ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు.
ఆడిట్‌ లేకపోవడమే కారణమా..?
రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా ఉన్న పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సకాలంలో ఆడిట్‌ నివేదికలు పంపకపోవడం వల్ల రైతుల రుణాలు రెన్యువల్‌ కాలేదని తెలుస్తోంది. దాంతో రుణమాఫీ పథకం వర్తించలేదు. ఈ విషయంలో ఇప్పటికే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆడిట్‌ రిపోర్ట్‌ను పంపాల్సిందిగా అధికారులను ఆదేశాలిచ్చింది. దాంతో అధికారులు ఆన్‌లైన్‌లోనే ఆడిట్‌ నివేదికలను పంపినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

రెన్యువల్‌ చేయకపోవడమే కొంపముంచింది
2018 కంటే ముందు తీసుకున్న రైతు రుణాలను అధికారులు రెన్యువల్‌ చేయకపోవడమే కొంపముంచింది. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఇటీవల వరంగల్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్కకు.. వినతిపత్రం ఇచ్చినం. వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయి.
– కన్నెబోయిన కుమార్‌ యాదవ్‌, గణపురం సొసైటీ చైర్మెన్‌

సీడెడ్‌ సొసైటీలకు రుణమాఫీ వర్తింపజేయాలి
వాణిజ్య బ్యాంకులకు అనుబంధంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లోని రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలి. ఆడిట్‌ సమర్పించలేదనే పేరిట రుణమాఫీని వర్తింప జేయకపోవడం విచారకరం. రైతును రైతుగానే చూడాలి. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి రైతులను బలి చేయొద్దు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి సొసైటీలు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఆ సొసైటీల్లోని రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– ఎం. చుక్కయ్య, హన్మకొండ జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం

ఆడిట్‌ నివేదికలు పంపాం
సకాలంలో ఆడిట్‌ నివేదికలు పంపని సంఘాలకు రుణమాఫీ కింద డబ్బులు జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆన్‌లైన్‌లోనే ఆడిట్‌ నివేదికలను సమర్పించాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– నాగేశ్వర్‌రావు, జిల్లా సహకార అధికారి, హన్మకొండ జిల్లా

Spread the love