నో డౌట్‌ …

— మళ్లీ మన ప్రభుత్వమే.. సాగునీరు ఇచ్చే బాధ్యత నాదే..
– కొన్ని దుష్టశక్తులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాప్యం
– పిల్లలను పెంచినట్టు చెట్లను పెంచాలి
– మహేశ్వరానికి మెడికల్‌ కాలేజీ మంజూరు

– కందుకూరు వరకు మెట్రోరైలు : హరిత దినోత్సవం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌
– రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు ఫారెస్టులో మొక్కలు నాటిన సీఎం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘రైతులు అధైర్యపడొద్దు.. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది.. అందేలో డౌటే లేదు.. ఈ ప్రాంతానికి సాగు నీరు తెచ్చే బాధ్యత నాదే.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తి కావాల్సిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై కొన్ని దష్టశక్తులు సుప్రీం కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డాయి. ఎంత మంది అడ్డువచ్చినా ఈ భూముల్లోకి నీళ్లు తెచ్చు ఖాయం.. తప్పకుండా ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు నీరు అందించి తీరుతా..’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఒకనాడు ఎండిన చెట్లు.. బీడుబారిన భూములతో దర్శనమిచ్చిన తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చుకోవడంలో విజయం సాధించామని చెప్పారు. తుమ్మలూరు ఫారెస్టులో పచ్చదనాన్ని చూసిన తరువాత హరితహార కార్యక్రమం చేపట్టినందుకు సంతృప్తి కలిగిందని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరులో సోమవారం హరితోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలూరు ఫారెస్టులో మంత్రులు, సీఎస్‌, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరుణంలో తెలంగాణలో ఎక్కడా చూసినా ఎండిన చెట్లు.. భూగర్భ జలాలు అడుగంటి ఏడారిగా దర్శనం ఇచ్చిందన్నారు. వందల ఫీట్ల లోతులోకి బోర్లు వేసినా చుక్కనీరు వచ్చేది కాదని, అప్పుడు స్వయంగా తాను ‘వానలు వాపసు రావాలి.. కోతులు అడవులకు పోవాలి’ అని పాట కూడా రాశానని సీఎం గుర్తు చేశారు.
పట్టుపట్టి.. జట్టుకట్టు దేశానికి రోల్‌ మోడల్‌ చేయడంలో అందరి కృషి ఫలించిందన్నారు. భవిష్యత్‌లో విరివిగా అడవులు పెంచేందుకు, పండ్ల చెట్లను ఉచితంగా పంచేందుకు బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇంట్లో పిల్లలను పెంచిన మాదిరిగా చెట్లను కూడా పెంచాలని సూచించారు. గ్రామాల్లో హరితహారం మొక్కల బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించినప్పుడు కొంత వ్యతిరేకత చూపినప్పటికీ.. చెట్లను కాపాడటంలో విజయం సాధించారని, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చైనాలో కొంత భూభాగం ఏడారిగా మారుతున్న సమయంలో 500 కోట్ల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచారన్నారు. తెలంగాణలో కూడా ఇప్పటి వరకు రూ.276 కోట్ల మొక్కలు నాటి 7.7 శాతం అడవులు పెంచామన్నారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత దేశంలో ధాన్యం ఉత్పత్తిలో 15, 16 స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం మొదటి స్థానంలో నిలువడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యుత్‌ సరఫరా, సంక్షేమం, విద్య, వైద్యం ఏ రంగంలో చూసినా మొదటి స్థానంలో ఉందన్నారు.
సాగునీరు ఇచ్చి తీరుతా..
కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తి కావాల్సిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్‌ అడ్డుకుందన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లి ప్రాజెక్టు పనులు నిలిపివేశారన్నారు. కృష్ణా నీళ్లలో వివాదాలు ఉన్నప్పటికీ.. గోదావరిలో ఏ లొల్లీ లేదన్నారు. గోదావరి నీళ్లు హిమాయత్‌సాగర్‌, గండిపేటకు వస్తున్నాయని, అక్కడి నుంచి లిఫ్టుతోనైనా ఈ ప్రాంతానికి అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
కందుకూరు వరకు మెట్రోరైలు
పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరం, కందుకూరు ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ప్రతి ఎయిర్‌పోర్టుకూ మోట్రో రైలు కనెక్ట్‌విటీ ఉటుంది కానీ గత ప్రభుత్వాలు అనాలోచిత నిర్ణయాలతో మన ఎయిర్‌పోర్టుకు మెట్రో లైన్‌ వేయలేదని అన్నారు. ఇటీవల ప్రభుత్వం దుర్గం చెరువు నుంచి శంషాబాద్‌కు మెట్రో రైలును విస్తరించిందని తెలిపారు. శంషాబాద్‌ నుంచి మెట్రో రైలును మహేశ్వరానికి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ కూడా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి రూ.160 కోట్లు ప్రకటించారు. మహేశ్వరం మండల తుమ్మలూరు గ్రామ పంచాయతీకి కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేశారు. దీనికి దశాబ్ది కమ్యూనిటీ హాల్‌గా నామకరణం చేయాలని సీఎం సూచించారు.
అటవీశాఖ అధికారి శ్రీనివాస్‌రావు భార్యకు డిప్యూటీ తహసీల్దార్‌గా పోస్టింగ్‌
విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయిన అటవీశాఖ అధికారి శ్రీనివాస్‌రావు భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగ నియమాక పత్రాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్బంగా అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు 500 గజాలు ఇంటి స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రాకరణ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, అటవీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్గే మల్లేష్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరిష్‌, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love