చేప పిల్లలేవీ..?

Any fish?– సీజన్‌ సమీపిస్తున్నా ఇంకా పిలవని టెండర్లు.. మత్స్యకారుల్లో ఆందోళన
– చేప పిల్లల సేకరణకు రెండు నెలల సమయం
– రాష్ట్రంలో గతేడాది 86.5 కోట్ల చేప పిల్లల పంపిణీ
– ఉచిత పిల్లల పంపిణీతో ఆదాయం, ఉపాధిని కల్పిస్తున్న చేపల పెంపకం
– ప్రభుత్వం సాయం చేయాలని మత్స్యకారుల డిమాండ్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదాయం, ఉపాధిని కల్పిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందిన మత్స్య పరిశ్రమకు సర్కార్‌ సాయం ఎంతైనా అవసరం. వేలాది మత్స్య సొసైటీల్లో లక్షలాది మంది వృత్తిదారులు జీవనోపాధి పొందుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నీటి వనరులు పెరగడంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఉచిత పిల్లల పంపిణీ వల్ల చేపల పెంపకం లాభసాటిగా మారింది. కానీ ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం మత్స్యకారుల్లో గందరగోళానికి తెరలేపింది. చేప పిల్లల్ని వదిలే సమయం సమీపిస్తున్నా టెండర్లు కూడా పిలవకపోవడంతో వృత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత పిల్లలు కాకపోయినా సొసైటీలకు సర్కార్‌ నేరుగా ఆర్థిక సహాయం అందించాలని వృత్తిదారులు కోరుతున్నారు.
రాష్ట్రంలో 23,748 నీటి వనరుల్లో చేపలు పెంచుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 4.5 లక్షల టన్నుల వరకు ఏటా చేపల ఉత్పత్తి జరుగుతోంది. ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే ఇది మరింత లాభసాటిగా మారుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5112 మత్స్య సంఘాలేర్పడగా వీటిల్లో సుమారు 4 లక్షల మంది వృత్తిదారులున్నారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, రంగనాయకమ్మ సాగర్‌కు నీటిలభ్యత బాగానే ఉంది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు జలాశయం, మెదక్‌ జిల్లాలో నవదుర్గ వంటి ప్రాజెక్టుల అభివృద్ధితో వేల సంఖ్యలో చెరువులు, కుంటలు, వాగులు ఇతర నీటి వనరులకు నీటి లభ్యత పెరిగింది. వీటిల్లో మత్స్యకారులు చేపల్ని పెంచుకుని జీవనోపాధి పొందుతున్నారు. నీటి వనరులు పెరిగినందున ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సంఖ్య పెరిగింది. 642 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా, 50 వేల మంది వరకు వృత్తిదారులు సభ్యులుగా ఉన్నారు. ఏటా 60 వేల టన్నుల వరకు చేపల ఉత్పత్తి జరుగుతుంది. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం చేప పిల్లల పంపిణీపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
గతేడాది 86.5 కోట్ల చేప పిల్లల పంపిణీ
గతేడాది ఇదే సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని సుమారు 5112 మత్స్య సొసైటీలకు రూ. 82 కోట్ల వ్యయంతో 77 కోట్ల బొచ్చ,
రవ్వ, బంగారుతీగ వంటి రకాల చేప పిల్లల్ని అందజేశారు. లాభసాటిగా ఉండేందుకు రూ.22 కోట్లతో 9.5 కోట్ల రొయ్య పిల్లల్ని కూడా పంపిణీ చేశారు. మొత్తం రూ.104 కోట్ల వ్యయంతో 86.5 కోట్ల చేప పిల్లల్ని మత్స్య సంఘాలకు పంపిణీ చేసి చెరువుల్లో వదిలారు.
నేరుగా ఆర్థిక సాయం..?
చేప పిల్లల పంపిణీ కోసం ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వం మత్స్య శాఖ ద్వారా టెండర్లు పిలిచేది. గతేడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి జూన్‌ వరకు ఖరారు చేసి చేప పిల్లల సరఫరాకు ఆదేశాలిచ్చింది. జూన్‌, జులై మాసాల్లో వర్షాలు పడి చెరువులు నిండినందున చేప పిల్లల్ని పంపిణీ చేశారు. చేప పిల్లల్ని ఉత్పత్తి కేంద్రాల నుంచి సేకరించి సొసైటీలకు అప్పజెప్పి చెరువుల్లో వదిలేందుకు కనీసం రెండు నెలల సమయమన్నా పడుతుంది. ప్రస్తుతం జూన్‌ మాసం సగం పూర్తయినా ఇంకా టెండర్లు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేయాలని భావించట్లేదని అధికారులు చెబుతున్నారు. నేరుగా మత్స్యకారులకే ఆర్థిక సహాయం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ముంచుకొస్తున్న సీజన్‌.. కురుస్తున్న వర్షాలు
ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున జూన్‌, జులైలో చేప పిల్లల్ని వదిలితే మంచి సైజు పెరుగుతాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటికే వానాకాలం వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో సంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షాపాతం 58.4 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటికే 93.6 మి.మీ వర్షం పడింది. మెదక్‌లోనూ 61.5 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే 77.2 మి.మీ వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో 55.0 సాధారణ వర్షపాతం కాగా ఇప్పటికే 56.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో చెరువుల్లో నీటి మట్టం పెరుగుతుంది. జులై వరకు చేప పిల్లల్ని వదిలితే ఉత్పత్తి ఆశించిన మేరకు వస్తదని వృత్తిదారులు అంటున్నారు.
చేప పిల్లల పెంపకానికి ఆరు నెలల కాలం
చేపలు కనీసం కిలో సైజు పెరగాలన్నా ఆరు నెలల సమయమైనా పడుతుంది. 40 రోజుల వయసున్న 35-40 ఎంఎం సైజు చేప పిల్లలు, లేదంటే 75 రోజుల వయసున్న పెద్ద సైజు పిల్లలు (80-100 ఎంఎం) సరఫరా చేసేది. వాటిని పెంచితేనే ఆరు నెలలు పట్టేది. ఇప్పుడు ఆలస్యమైతే అంతకంటే ఎక్కువ సైజు పిల్లల్ని చెరువుల్లో పోసుకోవాల్సి వస్తది. అందుకు పిల్లల ధర భారం కూడా పెరుగుతుందని పెంపకందార్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో చేప పిల్లల్ని చెరువుల్లో వదిలితే అవి పెరిగాక జనవరి నుంచి మార్చి వరకు చేపల్ని పట్టుకునేందుకు వీలుంటుందని, ఆలస్యమైతే ఎండల తీవ్రత వల్ల చేపలు చనిపోతాయని మత్స్యకారులు అంటున్నారు.

Spread the love