– ఆర్థిక ఇబ్బందుల్లో మున్సిపాల్టీలు
– పట్టణ ప్రగతి నిధులు రాక 20 నెలలు
– పెండింగ్‌లో కాంట్రాక్టర్ల బిల్లులు
– ఆదాయం తక్కువ- ఖర్చు ఎక్కువ
– మున్సిపాల్టీటీ ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రంలోని మున్సిపాల్టీటీలు తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల మున్సిపాల్టీల ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుండటంతో స్థానికంగా జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. అదేవిధంగా అభివృద్ధి కుంటుపడింది. 2019 తర్వాత మున్సిపాల్టీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీని ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటోంది. అదేవిధంగా జీఎస్టీ వచ్చాక నిధులు తగ్గాయి. దీంతో మున్సిపాల్టీలకు నేరుగా వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమయ్యాక.. విడుదల చేసే విధానం వచ్చింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఉన్న మున్సిపాల్టీల సంఖ్య కంటే అదనంగా మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలుగా చేశారు. అదేవిధంగా పలు గ్రామాలను మున్సిపాల్టీలలో విలీనం చేశారు. పట్టణ ప్రగతి కింద నిధులు మంజూరు చేసేవారు.. అవి కొన్ని నెలలుగా నిలిచిపోయాయి.. అభివృద్ధి కుంటుపడింది.
నిధులు ఇలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14వ, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌లను పట్టణ ప్రగతి గ్రాంట్‌లతో కలిపి ఫిబ్రవరి 2020 నుంచి మున్సిపాల్టీలకు నెలవారీ గ్రాంట్ కింద నిధులు మంజూరు చేస్తూ వచ్చింది. ఈ నిధుల నుంచి డంపింగ్ యార్డ్‌లు, పబ్లిక్ మరుగుదొడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా లైన్‌లు, పచ్చదనం పెంపు, శ్మశాన వాటికలు తదితర మౌలిక వసతులు చేపట్టారు. పై పనులు పూర్తి కాగానే జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల అనుమతితో మున్సిపాల్టీలలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర పనులు చేసుకునే అవకాశం ఉండేది. ఇదే విషయమై పురపాలక సంచాలకులుగా గతంలో పనిచేసి రిటైర్మెంటైన ఎన్.సత్యనారాయణ రివ్యూ సమావేశంలో చెప్పారు. దీంతో పలు మున్సిపాల్టీలలో వచ్చిన ఆదాయంతోపాటు రాబోవు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు పెద్దఎత్తున పనులు చేయించారు. కానీ 20 నెలల నుంచి మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు మంజూరు కాకపోవడంతో రూ.లక్షల్లో కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని మున్సిపాల్టీలలో కరెంట్ బిల్లులు, వీధి దీపాలు మెయింటనెన్స్ చేసే ఈఈఎస్‌ఎల్ పేమెంట్‌లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. పీఎఫ్, ఈఎస్‌ఐ కూడా చెల్లించని పరిస్థితి నెలకొంది.
అసలు మున్సిపాల్టీ ఆదాయం ఎటు పోతున్నది ?
2018 వరకు కూడా మున్సిపాల్టీలకు ఇంటి పన్నులు, నల్లా బిల్లులు, స్టాంపు డ్యూటీ (రిజిస్ట్రేషన్‌ఫై పన్ను) ఏంక్రోచ్‌మెంట్ పన్ను, ఎంటర్‌టైన్‌మెంట్ పన్ను, వాల్యూయేషన్ వేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ జారీ ఫీజు, ఓనర్‌షిప్ సర్టిఫికెట్స్ జారీ ఫీజులు, భవన నిర్మాణం అనుమతి ఫీజులు, లేఅవుట్ ఫీజులు, మడిగెల అద్దెలు, ఖాళీ స్థలాలఫై పన్ను విధించి మున్సిపల్ సాధారణ నిధుల కింద ఆదాయం సమకూర్చుకునే వారు. ఈ నిధులకు సరిపడా సిబ్బందిని నియమించుకొని వారికి జీతభత్యాలు, పారిశుధ్య నిర్వహణ మెయింటనెన్స్, మౌలిక వసతులు, పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించే వారు. కానీ 2019 నుంచి మున్సిపాల్టీలకు రావాల్సిన స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వ అకౌంట్‌లో జమ చేసుకుంటోంది. అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖ నుంచి రావాల్సిన ఆదాయం జీఎస్‌టి వచ్చాక మున్సిపాల్టీలకు రూపాయి కూడా రావడం లేదు. 2019లో రూపొందించిన కొత్త చట్టం వల్ల మున్సిపాల్టీ నుంచి ఎలాంటి ధృవీకరణ పత్రాలు జారీ కావడం లేదు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు నేరుగా మీసేవ అకౌంట్ల ద్వారా ప్రభుత్వ అకౌంట్‌లో జమ అవుతున్నాయి. నేరుగా ఇచ్చే భవన నిర్మాణం అనుమతులను టీఎస్‌బిపాస్ విధానాన్ని ఏర్పాటు చేసి ప్రయివేట్ ఏజెన్సీకి అప్పజెప్పారు. వారి నుంచి మున్సిపాలిటీలకు ఫీజులు సకాలంలో జమ కావడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్‌బిపాస్ హైదరాబాద్ వారి అకౌంట్‌లో జమైన తర్వాత మెయింటనెన్స్ ఖర్చులు, ట్యాక్స్‌లను మినహాయించుకుని మున్సిపల్ అకౌంట్లలో జమ చేస్తున్నారు.ఔ
నేటికీ కొన్ని మున్సిపాల్టీల నుంచి భవన నిర్మాణాలు ఎన్ని ఇచ్చారు? ఎంత ఆదాయం మున్సిపాల్టీలకు పేమెంట్ చేశారన్న దానికి లెక్కాపత్రం లేని పరిస్థితి. అసలు మున్సిపాల్టీలలో ఎన్ని భవనాలకు అనుమతి ఇచ్చారు.. ఎంత ఆదాయం ప్రభుత్వ అకౌంట్లలో జమ అయింది.. మున్సిపాలిటీ అకౌంట్‌లో ఎంత జమ చేస్తున్నారో అనే వాటికి లెక్క లేదు. దీని వల్ల ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే మున్సిపాల్టీలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి పన్ను, నల్లా బిల్లుల వసూలులో కూడా ఆశించిన ఆదాయం మున్సిపాల్టీలకు రావడం లేదు.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజుర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో సూర్యాపేట మున్సిపాలిటీలో 20 నెలల నుంచి పట్టణ ప్రగతి నిధులు నిలిచిపోయాయి. నెలకు రూ.46 లక్షల చొప్పున 20 నెలలకు రూ.9 కోట్లా 20 లక్షలు విడుదల కావాల్సి ఉంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు నేరుగా మీ సేవ అకౌంట్‌ల ద్వారా ప్రభుత్వ అకౌంట్‌లో జమ కావడంతోపాటు, భవన నిర్మాణ అనుమతులను టిఎస్ బిపాస్ విధానంతో ప్రయివేట్ ఏజెన్సీకి అప్పజెప్పడంతో మున్సిపాలిటీలకు ఫీజులు సకాలంలో జమ కావడం లేదు. ఒకప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీలో ఉద్యోగులు, సిబ్బంది, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నెల మొదటి తేదీనే జీతాలు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం సకాలంలో జీతభత్యాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం వెంటనే రూ.9.20 కోట్లు విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతికి సంబంధించిన నిధులు రూ.9.20 కోట్లు విడుదల చేయకపోవడంతో సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జీతభత్యాలకు ఇబ్బందిగా మారింది. అదేవిధంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపి వేయడంతోపాటు కొత్తగా నిధులు మంజూరు చేయకపోవడంతో సంవత్సరం నుంచి అభివృద్ధి నిలిచిపోయింది.
మున్సిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ నాణ్యత లేని పనులు..
పట్టణాల్లో వివిధ నిధుల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు సీసీ, బీటీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణంలో నాణ్యత లోపించి వేసిన రోడ్లు ఒకటి రెెండేండ్లలోపే గుంతల మయంగా మారి కంకరతేలుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారులు పర్సంటేజీలపై చూపుతున్న శ్రద్ధ పనుల నాణ్యతలో చూపడం లేదనే విమర్శలు ప్రతి మున్సిపాలిటీలోనూ వినిపిస్తున్నాయి.
మున్సిపాల్టీల ప్రధాన ఆదాయం, ఇంటి పన్ను, నల్లాబిల్లుల వసూలు, ఇంటి నెంబర్ జారీలో రెవెన్యూ అధికారుల చేతివాటంతో ఇంటి పన్ను తక్కువ వేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌లో ఆశించిన అన్ని గృహాలను నమోదు చేయకుండా ట్యాక్స్‌లను వసూలు చేసి తమ జేబులలో వేసుకుంటున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. రాష్టంలోని చాలా మున్సిపాల్టీలలో అకౌంట్స్ విభాగంలో చైర్మెన్, కమిషనర్ల ఒత్తిళ్లతో ఫైల్స్ లేకున్నా చెక్కులు డ్రా చేసుకుంటున్నారు. ఇవన్నీ అడిట్‌లో కనిపించకుండా మ్యానేజ్ చేస్తూ ఆదాయానికి గండికొడుతున్నారు.
పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తం
పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల అలసత్వం, సరిపడా సిబ్బంది లేకపోవడం ఇబ్బందులకు దారి తీస్తోంది. ఇందులోనే ఉన్న సిబ్బంది తోనే ప్రజాప్రతినిధులు, అధికారులకు సంబంధించిన పనులు చేయిస్తున్నారు.
దీంతో సిబ్బంది తక్కువై పారిశుధ్యం పడకేస్తోంది.
ఇదిగాక జిల్లా స్థాయిలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ కార్యక్రమాలకు మున్సిపల్ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు. వార్డ్‌లు పెరిగినా సరైన సిబ్బంది లేకపోవడం వల్ల కూడా పనులు చేయించలేని దుస్థితి నెలకొంది.