నో ఇన్‌కమింగ్‌…ఓన్లీ ఔట్‌ గోయింగే

– నేడు రాజగోపాల్‌రెడ్డి.. రేపెవరో?
– ఎన్నికల వేళ తుస్సుమంటున్న బీజేపీ బాంబులు
– కొత్తగా ఈటల వర్సెస్‌ విద్యాసాగర్‌రావు పంచాయితీ
– తమకు న్యాయం చేయాలంటున్న హార్డ్‌కోర్‌ కార్యకర్తలు
– పార్టీ మారాలని వలస నేతలపై అనుచరుల ఒత్తిడి
చేరికలకు ఎన్ని ప్రణాళికలు వేసినా ఆ పార్టీలో ఔట్‌ గోయింగే తప్ప ఇన్‌కమింగ్‌ లేని పరిస్థితి. గ్రామ, మండల స్థాయి నేతలను చేర్చుకుని చేరికలని పెద్దగా చేసి చూపెడుతున్నది. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీనే అని భావించి ఆ పార్టీలో చేరి అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి జీర్ణించుకోలేక పార్టీని వీడిన వారి లిస్టు పెద్దగానే ఉంది.పార్టీని వీడిన వారిలో స్వామిగౌడ్‌, ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్‌, మోత్కుపల్లి నర్సింహులు, రాపోలు ఆనందభాస్కర్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, ఎర్రశేఖర్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి, పుష్పలీల, నాగం జనార్ధన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, తదితర నేతలున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల వేళ బీజేపీకి బిగ్‌షాక్‌. తమ పార్టీలో గెలిచే తొలి అభ్యర్థి అని చెప్పుకుంటున్న రాజగోపాల్‌రెడ్డి హ్యాండిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. కేసీఆర్‌పై పోరాటంలో బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందంటూ బాంబు పేల్చేశారు. ‘బీజేపీ వద్దు…కాంగ్రెస్‌లో చేరు’ అని అనుచరులు, నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేయడంతోనే తాను పార్టీ మారుతున్నానంటూ ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డి బాటలోనే మరికొంత మంది సీనియర్‌ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు చర్చ నడుస్తున్నది. ఏడాది కాలం పాటు తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామంటూ హడావిడి చేసిన నేతలంతా మెత్తబడిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్సెన్‌ టీఆర్‌ఎస్‌ అనే మూడ్‌ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఐదారు నెలల కింద తారాజువ్వల్లా ఎగిసి పడిన నేతలు ఇప్పుడు తుస్సు బాంబుల్లా మారారు. ఘోరంగా ఓడిపోతే ఉన్న పరువు కాస్తా ఎక్కడ పోతుందో అనే భయంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకుతున్నారు. ఈ జాబితాలో డీకే అరుణ, వివేక్‌, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, తదితర కీలక నేతలంతా ఉన్నారు. మరి కొందరు కీలక నేతలు పార్టీని కూడా వీడబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
అధిష్టానం కోర్టులో వేములవాడ పంచాయితీ
వేములవాడ నియోజవర్గంలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలకు మించిన భారంగా మారింది. మొదట ఈ సీటుపై బండి సంజరు ఆసక్తి చూపినప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావు ప్రతిమ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ నుంచి సీటును ఆశిస్తున్నారు. అదే నియోజకవర్గం నుంచి తనను అభ్యర్థిగా ప్రకటించాలని కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ పట్టుబడుతున్నారు. ఆ పార్టీ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయనది స్వతహాగా వేములవాడ నియోజకవర్గమే. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్‌ కూడా సీటు ఆశించినప్పటికీ ఆయన బలంగా రేసులో లేరు. ఈటల రాజేందర్‌తో కలిసి తుల ఉమ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి వేములవాడ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. తుల ఉమకు ఈటల, వికాస్‌రావుకు విద్యాసాగర్‌రావు అండగా ఉండి టికెట్‌ కోసం తమ శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటు విషయంలో ఎటూ తేల్చలేక రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసింది. ప్రకాశ్‌ జవదేకర్‌, సునీల్‌బన్సల్‌తో విద్యాసాగర్‌రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదే విషయంపై ఈటల కూడా వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఇప్పుడు పరిస్థితి ఈటల వర్సెస్‌ విద్యాసాగర్‌రావుగా మారింది.
న్యాయం చేయండంటూ ప్రదక్షిణలు
పార్టీ కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్నా తమకు సీట్లు ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన డబ్బున్నవాళ్లకే సీట్లు కేటాయిస్తుండటంపై ఆ పార్టీ హార్డ్‌కోర్‌ నాయకులు గుస్సా అవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పార్టీ రాష్ట్ర కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీ నుంచి జహీరాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్న ఢిల్లీ వసంత కుమార్‌ జాతీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. షాద్‌నగర్‌ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి తనకు టికెట్‌ ఇవ్వాలని కోరుతూ బీజేపీ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి సీటు ఆశిస్తున్నారు. జనగామలో బలమైన బీసీ సామాజిక తరగతికి చెందిన నేత బి.బీరప్పకు టికెట్‌ ఇవ్వకుండా దస్మంతరెడ్డికి ఇవ్వడం కొత్త పంచాయితీకి దారితీసింది. ఏండ్లతరబడి పనిచేస్తున్న బీరప్పకు టికెట్‌ ఇవ్వకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉంది.
రవికుమార్‌ వినూత్న పోరాటం
ధర్మపురిలో ఎంతో కాలంగా బీజేపీలో ఉన్న తనకు కాదని వేరేవారికి టికెట్‌ ఇవ్వడంపై రాయిల్ల రవికుమార్‌ రాష్ట్ర నాయకత్వంపై వినూత్న పోరాటం చేస్తున్నారు. తనకు ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం వరకు సైకిల్‌పై ‘విజ్ఞప్తి యాత్ర’ చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో, మోడీ ప్రధాని కావాలని తాను చేపట్టిన సైకిల్‌ యాత్ర, సంస్థాగతంగా పట్టులేని చోట పార్టీ బలోపేతం కోసం తాను చేసిన కృషిని వివరిస్తూ రాష్ట్ర కార్యాలయం వద్ద నేతలను కలిసి మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపించింది.

Spread the love