– సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభలకు ముస్తాబైన సంగారెడ్డి
– నేడు భారీ ర్యాలీ.. బహిరంగ సభ
– 26-28 తేదీల్లో ప్రతినిధుల సభ
– హోర్డింగ్స్, ఎర్రజెండాలు, తోరణాల రెపరెపలతో ఎరుపెక్కిన పారిశ్రామిక ప్రాంతం
– హాజరుకానున్న సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులు
– రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు
– పీఎస్‌ఆర్ గ్రౌండ్‌లో బహిరంగ సభ గోకుల్ గార్డెన్‌లో ప్రతినిధుల సభ
– మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: చుక్క రాములు, ఆహ్వాన సంఘం చైర్మెన్
సంగారెడ్డి నుంచి మేకల కృష్ణయ్య
కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రాంగణంలో ఈ నెల 25-28 తేదీల్లో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభలకు సంగారెడ్డి ముస్తాబైంది. హోర్డింగ్స్, ఎర్రజెండాలు, తోరణాల అలంకరణతో పారిశ్రామిక ప్రాంతం ఎరుపెక్కి అరుణమయంగా మారింది. ఎటు చూసినా ఎర్రజెండాల తోరణాలు రెపరెపలా డుతున్నాయి. సంగారెడ్డి పట్టణం విరబూసిన ఎర్ర మందారంలా మెరుస్తోంది. సంగారెడ్డి ఉద్యమ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నందున అత్యంత విజయవంతంగా జరిపేందుకు ఆహ్వాన సంఘం అనేక ఏర్పాట్లు చేసింది. వినూత్న రీతిలో మహాసభల ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. బహుముఖ కార్యక్రమాల ద్వారా ఎర్రజెండా విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లింది. 25న భారీ ప్రదర్శన, బహిరంగ సభ, 26-28 తేదీల్లో ప్రతినిధుల సభలు జరగనున్నాయి. బహిరంగ సభ, ప్రతినిధుల సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎర్రజెండాల రెపరెపలు
సంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతమైన లింగంపల్లి చౌరస్తా నుంచి ముంబయి జాతీయ రహదారి వెంట ప్రతినిధుల సభలు జరిగే గోకుల్ గార్డెన్ వరకు ఎర్రజెండాలు, తోరణాలతో అలంకరించారు. ఎన్‌హెచ్ పొడవునా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, సీతారాం ఏచూరి, మల్లు స్వరాజ్యం ఫొటోలతో కూడిన హోర్డింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగారెడ్డి పట్టణంలోని చౌరస్తా నుంచి ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాల వరకు హోర్డింగ్స్, ఎర్రజెండాలు, తోరణాలతో అలంకరిం చారు. ఎటు చూసినా ఎర్రజెండా రెపరెపలే కనిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రజా పోరాట కేంద్రాలుగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, కేవల్ కిషన్ భవన్‌లను మెర్క్యూర్ లైట్స్‌తో ముస్తాబు చేశారు. బహిరంగ సభ జరిగే పీఎస్‌ఆర్ గ్రౌండ్స్‌ను సీపీఐ(ఎం) మహానీయుల ఫొటోలతో కూడిన హోర్డింగ్స్, భారీ ప్లెక్సీలు, ఎత్తైన ఎర్రజెండాలు, తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. దారి పొడవునా సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల ప్రచారానికి సంబంధించిన గోడరాతలు, పోస్టర్లతో జాతీయ రహదారి కాంతులీనుతోంది.
వినూత్న పద్ధతుల్లో ప్రచార కార్యక్రమాలు
ఏరియా కమిటీ స్థాయి నుంచి బలమైన ప్రజా ఉద్యమాలు నిర్వహించే స్థాయికి ఎదిగిన సంగారెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ వినూత్న పద్దతుల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పటికే జీపుజాత ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మహాసభల ప్రచారం చేశారు. మెడికల్, రక్తదాన శిబిరాలు, ముగ్గులు, ఇతర క్రీడా పోటీలు, సెమినార్స్, సదస్సులు, సమావేశాలు, జనకవనం, సాంస్కృతికోత్సవాలు, ఫొటో ఎగ్జిబిషన్, కోలాట, పాటల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో పార్టీ చిన్నదే అయినప్పటికీ శక్తికి మించి బలమైన ఉద్యమ కేంద్రాలకు తీసిపోని రీతిలో మహాసభలకు ఏర్పాట్లు, ప్రచార కార్య క్రమాలు చేయడంతో సీపీఐ(ఎం).. అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించగల్గుతోంది.
నేడు బహిరంగ సభ.. హాజరుకానున్న బృందాకరత్, బీవీఆర్, తమ్మినేని
సంగారెడ్డి చౌరస్తా సమీపంలోని పీఎస్‌ఆర్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆహ్వాన సంఘం చైర్మెన్ చుక్కరాములు హాజరుకానున్నారు. వీరితో పాటు జాతీయ, రాష్ట్ర నాయకత్వం కూడా సభలో ప్రసంగిస్తారు. ముందుగా స్థానిక ఐబీ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు భారీ ప్రదర్శన ప్రారంభంకానుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు, కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, దళితులు, గిరిజనులు, యువజనులు, కళాకారులు భారీగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వ ర్యంలో బహిరంగ సభకు తరలి వచ్చేందుకు వాహనాలు సమకూర్చుకున్నారు. వివిధ వృత్తులకు చెందిన వాళ్లు మోకు ముస్తాదు, వలలు, డోలువాయిద్యాలతో కోలాట, డప్పు, నృత్య కళాకారులు, పీఎన్‌ఎం కళాకారులు ఆటా-పాటా-మాటలతో ప్రదర్శనలో పాల్గొననున్నారు. ర్యాలీలో భాగంగా జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించబోతున్నారు.
ప్రతినిధుల సభలో ప్రకాశ్‌కరత్ ప్రారంభోపన్యాసం..
నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ, ప్రతినిధుల సభలు జరిగే ప్రాంతంలో ఎర్రజెండాలు, తోరణాలు, హోర్డింగ్స్, ఆర్చీలతో అలంకరించారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్, పొలిట్‌బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు హాజరుకానున్నారు. ప్రకాశ్‌కరత్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై సౌహార్ధ్ర సందేశం ఇవ్వనున్నారు. మిగతా వామపక్ష నేతలూ హాజరయ్యే అవకాశం ఉంది. మహాసభలకు 700 మంది ప్రతినిధులతో పాటు పరిశీలకులు, ఆహ్వానితులు హాజరుకానున్నారు. వీరికి కూడా నాలుగు రోజుల పాటు ఉండేందుకు వసతి, భోజన ఏర్పాట్లను ఆహ్వాన సంఘం చేసింది.
అద్భుతంగా ప్రతినిధుల ప్రాంగణం
మూడు రోజులు పాటు జరిగే ప్రతినిధుల సభకు స్థానిక గోకుల్ గార్డెన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. మహాసభల ముఖద్వారాన్ని భారీ హోర్డింగ్స్, ఆర్చీలు, జెండాలు, తోరణాలతో అలంకరించారు. కమ్యూనిస్టు మహనీయుల ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు కట్టారు. జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన స్వాగత ప్రాంగణం ఎర్రకాంతుల్ని విరజిమ్ముతోంది. ప్రతినిధుల సభ వద్ద మీడియా పాయింట్, మెడికల్ క్యాంపు, పుస్తక ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్, అమరవీరుల స్మారక స్థూపం, పార్టీ జెండా దిమ్మె ప్రత్యేకార్షణగా నిలుస్తున్నాయి.
చారిత్రిక నేపథ్యంలో మహాసభలు :చుక్క రాములు, ఆహ్వాన సంఘం చైర్మెన్
దేశం, రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా సంగారెడ్డిలో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు చారిత్రిక నేపథ్యముంది. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పాటు ప్రమాదకరమైన మతోన్మాద పోకడలు పెరిగాయి. వీటికి వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడే వామపక్షాలు మరింత బలపడాల్సిన అవసరముంది. అందులో భాగంగా సీపీఐ(ఎం) తన సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర 4వ మహాసభల్ని సంగారెడ్డిలో నిర్వహిస్తోంది. ప్రజల సంపూర్ణ సహకారంతో మహాసభల్ని విజయవంతంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి జరుగుతోంది. బహిరంగ సభకు పార్టీ శ్రేణులతో పాటు కార్మికవర్గం, రైతులు, మహిళలు, సామాజిక శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చాం.