గూడెం ఓటర్లు…ఏ ‘రావు’కి పట్టంకట్టునో…!

– నేడే అభ్యర్థుల జాతకాలు వెల్లడి
– గెలుపు ధీమాలో అన్ని అన్ని పార్టీల అభ్యర్థులు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గంలో నవంబర్‌ 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలో ఉండగా ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ప్రధాన పోటి జరిగిందని చెప్పాలి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ‘కారు’ గుర్తుపై బరిలో నిలవగా, కాంగ్రెస్‌, టిడిపి, సీపిఎం, సిపీఐ ఎన్‌డి ప్రజాపంథా, టిజేఎస్‌ పార్టీల మద్దతతో బరిలో ఉన్న సిపిఐ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పోటీలో ఉన్నారు. వీరితోపాటు బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా వనమా వెంకటేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, జలగం వెంకటరావు ”రావు”ల మధ్య త్రిముఖ పోటీ జరిగింది. ఎన్నికల ప్రచారం పూర్తిస్థాయిలో హోరెత్తించినప్పటికీ పోలింగ్‌ సమయంలో కొన్ని పార్టీలు చతికిల పడ్డాయని, అభ్యర్థులకు తాయిలాల పంపిణీలో వెనకడుగు వేశారని, ప్రజల నుండి నిరాశ వెల్లువెత్తడంతో పార్టీలకు చుక్క ఎదురైంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా బరిలో ఉన్న వనమా వెంకటేశ్వరరావు ఈసారి సైతం గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పది ఏండ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్య తి రేకత, రాష్ట్ర వ్యా ప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తున్న క్రమంలో స్థానికంగా కాంగ్రెస్‌, టిడిపి, సీపిఎం, సిపీఐ ఎన్‌డి ప్రజాపంథా, టిజేఎస్‌ పార్టీల మద్దతతో బరిలో ఉన్న సిపిఐ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గెలుపు తద్యమని వారు భావిస్తున్నారు. 2014లో తెలంగాణ సెంటిమెంట్‌తో ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంకటరావు గెలిచారు. 2018లో ఓటమి పాలైన ఆయన నియోజకవర్గం ప్రజలకు దూరంగా ఉండడం, 2023లో మరోసారి అభివృద్ది, నో దందా…నో చందా.. నినాదంతో బరిలో నిలిచారు.
ఏ ”రావు” పీఠం
కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటివరకు అనేక పర్యాయాలుగా పేరు చివర ”రావు” పేరుతో ఉన్న అభ్యర్థులే ఎక్కువగా బరిలో నిలిచారు.. గెలిచారు. తొలుత పాల్వంచ నియోజకవర్గం ఆ తర్వాత 1978 అనంతరం కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొమ్మిది సార్లు పేరు చివర రావు ఉన్న వారే గెలుపు సాధించారు. 1978లో నియోజకవర్గంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో చేకూరి కాశయ్య జనతా పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోనేరు నాగేశ్వరరావు గెలుపొందారు. అనంతరం 1985లో సైతం కోనేరు నాగేశ్వరరావు టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. 1989లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1994లో మరోసారి కోనేరు నాగేశ్వరరావు టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. 1999లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. తరువాత 2009లో కూనంనేని సాంబశివరావు సిపిఐ అభ్యర్థిగా గెలుపొందారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో 2014లో జలగం వెంకటరావు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం 2023 ఎన్నికల్లో గతంలో ఎన్నికల్లో గెలుపొంది, ఓటమి చవిచేసిన అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థుల పేరు చివరన ”రావు” అని ఉన్నవారే గెలుపు బాటలో నిలిచారు. వనమా వెంకటేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, జలగం వెంకటరావులు ఈ సారి 2023 నవంబర్‌ 30వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఆదివారం కౌంటింగ్‌ జరగనుంది. ఈ కౌంటింగ్‌లో ఈసారి కొత్తగూడెం ఓటర్లు ఏ ”రావు” గారిని అధికార పీఠంపై నిలబెట్టనున్నారో…వేడిచూడాలి.

Spread the love