నవతెలంగాణ-హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఓటుకోసం ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకోండని, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ముల్లును ముల్లుతోనే తీయాలని, కాబట్టి మోసాన్ని మోసంతోనే దెబ్బకొట్టాలన్నారు. అందుకే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఏ టు జెడ్ కుంభకోణాలు చేసి డబ్బులు బాగా సంపాదించారన్నారు. ఆ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి రావొచ్చునని పగటి కల కంటున్నారన్నారు. కాబట్టి వారికి బుద్ధి చెప్పాల్సి ఉందన్నారు. దశాబ్దాల పాటు మనల్ని హింసించినవాళ్లు కొత్త వేషాలు వేసుకొని వస్తున్నారని, అలాంటి వారి మాటలను నమ్మవద్దని సూచించారు. మూడోసారి కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అబద్దపు హామీలను ఇస్తోందన్నారు. అలాంటి హామీలను నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్లు అవకాశమిస్తే చేసిందేమీ లేదన్నారు. రూ.200 పెన్షన్ ఇవ్వని వారు రూ.4వేలు ఇస్తారంటే నమ్ముతారా? అన్నారు. బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం రజాకార్ సినిమా నేపథ్యంలో బీజేపీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రజాకార్ అని ఓ బీజేపీ నేత సినిమా తీశాడన్నారు. కులం, మతం పేరుతో మానిన గాయాలను మళ్లీ రెచ్చగొట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. ఓ వైపు కశ్మీర్ ఫైల్స్, మరోవైపు రజాకార్ సినిమా తీశారని ధ్వజమెత్తారు.