ఇకపై విద్యార్థినులకు నెలసరి సెలవులు…

నవతెలంగాణ – పంజాబ్‌: చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీ(పీయూ) 2024-25 వార్షిక సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. పీయూ వైస్ ఛాన్స్‌లర్‌ రేణువిగ్ ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు, షరతులను విధించారు. అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం విద్యార్థులు ఒక సెమిస్టర్‌కు గరిష్టంగా నాలుగు లీవ్‌లు తీసుకునేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే సెమిస్టర్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ లేదా ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సెలవులు మంజూరు చేయరు. రుతుక్రమ సెలవులు పొందేందుకు విద్యార్థులు స్వీయ ధృవీకరణ ఆధారంగా ఫారంను నింపి డిపార్టుమెంట్‌ ఛైర్‌పర్సన్‌ లేదా డైరెక్టర్‌ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. పంజాబ్ విశ్వవిద్యాలయం డీన్ ఆధ్వర్యంలో ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ మొదటి సమావేశం జనవరి 24న జరగ్గా రుతుక్రమ సెలవుల మంజూరును విశ్వవిద్యాలయ ప్రధాన కార్యదర్శి దీపక్ గోయత్, ఉపాధ్యక్షురాలు రణ్‌మీక్‌జోత్ కౌర్ వ్యతిరేకించారు. ఈ విధానాన్ని అమలుచేస్తున్న ఆరు విశ్వవిద్యాలయాల నుంచి ప్రతిపాదనలను సమర్పించారు. వాటిని అధ్యయనం చేసిన అనంతరం ఒక విధానాన్ని రూపొందించడానికి ఫిబ్రవరి 15న సబ్‌కమిటీని ఏర్పాటుచేశారు.

Spread the love