సిట్‌ అవసరం లేదు అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : అదానీ గ్రూపుకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అపరిష్కృతంగా ఉన్న రెండు కేసుల దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయాలన్న వాదనలో అర్థంలేదని బుధవారం ఇచ్చిన తీర్పులో తెలిపింది. అదానీ గ్రూపుపై వచ్చిన 24 ఆరోపణల్లో 22 ఆరోపణలకు సంబంధించిన కేసుల విచారణను ఇప్పటికే సెబీ పూర్తి చేసిందని గుర్తు చేసింది. కోర్టు నియమించిన కమిటీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్ధివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. అదానీ గ్రూపు తన కంపెనీల వాటాల విలువను కృత్రిమంగా పెంచిందంటూ న్యాయవాదులు విశాల్‌ తివారీ, ఎంఎల్‌ శర్మ, కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌, అనామికా జైశ్వాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగానే అదానీ గ్రూపు అవకతవకలు వెలుగు చూడడం లేదని ఆరోపించారు. దీనిపై గతంలో తీర్పు రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు బుధవారం దానిని వెల్లడించింది. హిండెన్‌బర్గ్‌ నివేదికలోని అంశాలను వాస్తవాలుగా పరిగణించలేమని తెలిపింది. కాగా తీర్పుపై అదానీ హర్షం వ్యక్తం చేశారు.

Spread the love