కొత్త కేసులు లేవు

Kerala Health Minister Veena George on Nifa– నిఫాపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌
కోజికోడ్‌ : కేరళలో శనివారం కొత్త నిఫా పాజిటివ్‌ కేసులేవీ నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, వ్యాధి ఇంకా రెండో దశకు రాలేదని మంత్రి తెలిపారు. అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మరో ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు మంత్రి తెలిపారు. వీరి నమూనాల పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. చికిత్స పొందుతున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటిలేటర్‌పై ఉన్న తొమ్మిదేండ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి కూడా స్వల్పంగా మెరుగుపడిందని మంత్రి తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో నిఫా చికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 5 నిఫా కేసులు వెలుగు చూశాయి. 1192 మందిని కాంటాక్ట్‌ లిస్ట్‌లో చేర్చారు. శనివారం కొత్తగా మరో 97 మందిని చేర్చారు. ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తితో తాను మాట్లాడానని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన లేదని మంత్రి తెలిపారు. నిఫా వైరస్‌ గురించి సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం మంత్రి మహ్మద్‌ రియాజ్‌ మాట్లాడుతూ నిఫా వార్తలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించి కచ్చితమైన సమాచారం మాత్రమే తెలియజేయాలని కోరారు.

Spread the love