హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్ టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని నాయికగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో బెల్లంకొండ గణేష్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.’ఇందులో రియల్ ఇన్సిడెంట్స్‌ని చాలా యూనిక్‌గా చూపించారు. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకూ అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. ఈ కథని కష్ణ చైతన్య రాశారు. రాకేష్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కథ విన్నప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్‌కి బాగా కనెక్ట్ అయ్యాను. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. హ్యాపీగా మొదలై మధ్యలోకి వచ్చేసరికి బాధ, టెన్షన్ ఉంటూ చివర్లో ఎదురుతిరిగి తనకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడ్డాడనే క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా బాగా నచ్చింది. భాగ్యశ్రీ గారి అమ్మాయి అవంతిక చక్కగా నటించింది. సముద్రఖని పాత్ర ఈ సినిమాకి పెద్ద యాడ్ ఆన్. మహతి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత సతీష్ వర్మ ‘నాంది’తో మంచి విజయం అందుకున్నారు. ఒక హిట్ సినిమా సంస్థ నుంచి వచ్చే సినిమా అంటే సహజంగానే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కి కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే సినిమా ఇది అని కచ్చితంగా చెప్పగలను.