గుట్టలో నన్నెవరూ అవమానించలేదు..

No one insulted me in Gutta..– సోషల్‌ మీడియా ట్రోల్స్‌ అవాస్తవం..: డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
యాదగిరి గుట్ట దేవాలయంలో తనకేదో అవమానం జరిగినట్టు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారనీ, అది అవాస్తవమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తాను పాదయాత్ర సమయంలోనూ యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహాస్వామి దర్శనం చేసుకున్నాననీ, తిరిగి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొక్కు తీర్చుకోవడంలో భాగంగా తానే ఓ చిన్న పీట మీద కూర్చుని, అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. దాన్ని సోషల్‌ మీడియాలో విస్త్రుతంగా ప్రచారం చేశారనీ, తనను ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ”ఉప ముఖ్యమంత్రిగా, విద్యుత్‌, ఆర్థిక, ప్రణాళికా శాఖల మంత్రిగా ఈ రాష్ట్ర నిర్ణయాలను శాసిస్తున్నాను. ఎవరికో తలవంచేవాడిని కాదు. ఆత్మగౌరవం లేని వాడిని అసలే కాదు” అని అన్నారు. బహుశా ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా బాధపడితే మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్లు
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్దుల కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్స్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తన పాదయాత్ర సందర్భంగా అనేకమంది పేదలు తమ పిల్లలకు చదువులు చెప్పించి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌ వంటి చోట్ల పోటీ పరీక్షలకు శిక్షణ ఇప్పించడం తలకు మించిన ఆర్థికభారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. దానికోసమే ప్రసిద్ధి చెందిన అధ్యాపకులతో ఆన్‌లైన్‌ ద్వారా బోధన ఇప్పించాలని, ఉద్యోగార్ధులు హైదరాబాద్‌ రాకుండా ఎక్కడిక్కడే నాలెడ్జ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకొనేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Spread the love