– భారత్‌పై టారిఫ్‌ల పట్ల ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్ : పరస్పరం టారిఫ్‌లు విధించే విషయమై ఇతర అన్ని దేశాలతో సహా భారత్‌కు ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. టారిఫ్‌ల విషయంలో తనతో ఎవరూ వాదించలేరని అన్నారు. ట్రంప్, ఎలన్ మస్క్‌లతో సంయుక్తంగా చేసిన ఇంటర్వ్యూను ఫాక్స్ న్యూస్ మంగళవారం రాత్రి ప్రసారం చేసింది. ఆ ఇంటర్వ్యూలోనే ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13న వైట్‌హౌస్‌లో ట్రంప్, ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీకి కొద్ది గంటల ముందే పరస్పర టారిఫ్‌లపై ట్రంప్ ప్రకటన చేశారు. ఈ టారిఫ్ ప్రణాళిక ప్రకారం ఆయా దేశాలు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై ఎంత సుంకమైతే విధిస్తాయో అంతే మొత్తాన్ని అమెరికా, ఆయా దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించనుంది. ప్రతి ఒక్క విదేశీ వాణిజ్య భాగస్వామికి సంబంధించి ఈ పరస్పర టారిఫ్ అమలవుతుందనిచెప్పారు.
”మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే, పరస్పరం టారిఫ్‌లు విధించుకోబోతున్నాం. మీరు మా ఉత్పత్తులపై ఎంత సుంకం విధిస్తారో, అంతే మొత్తంలో మేం కూడా మీ ఉత్పత్తులపై సుంకం విధిస్తాం.” అని ప్రధాని మోడీకి స్పష్టం చేసినట్లు ట్రంప్ చెప్పారు. ”ఈలోగా మోడీ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. నో, నో, మీరేమీ చెప్పొద్దు, నాకిష్టం లేదు. మీరే ఏదైతే చార్జీ విధిస్తారో మేం కూడా అదే చార్జీలు విధిస్తాం. ప్రతి దేశంతోనూ మేం ఇలాగే వ్యవహరిస్తాం.” అని తేల్చి చెప్పినట్లు ట్రంప్ చెప్పారు. ”ఒకవేళ నేను 25శాతం పన్నులు విధిస్తానని చెప్పాననుకోండి, అబ్బో చాలా ఎక్కువ అంటారు. అందుకే నేను ఏం చెప్పదలచుకోలేదు..మీరేది విధిస్తే, మేం కూడా అదే విధిస్తాం…ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? వారు ఆపేస్తారు.” అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నుండి వచ్చే కొన్ని దిగుమతులపై అంటే ఆటో మొబైల్ రంగ ఉత్పత్తులు వంటి వాటిపై భారత్ చాలా పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుంది. అమెరికా తయారీ కార్లపై వంద శాతమూ టారిఫ్‌లు విధిస్తారని మస్క్ వ్యాఖ్యానించారు. మోడీతో సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్నపుడు భారత్‌పై పరస్పర టారిఫ్‌ల గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, ”ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారత్‌లో అధిక సుంకాలు వున్నాయి. భారత్‌కు విక్రయించడం చాలా కష్టం, అనేక వాణిజ్య అవరోధాలు వుంటాయి, పెద్ద మొత్తాల్లో పన్నులు వుంటాయి.” అని అన్నారు. ”అందుకే ఇప్పుడు మేం పరస్పర పన్నుల విధింపు చర్యలు అమలు చేస్తున్నాం. ఎవరైనా ఒకవేళ తగ్గించారనుకోండి, మేం కూడా అలానే తగ్గిస్తాం. భారత్ ఏ తరహాలో పన్నులు విధిస్తుందో, మేం కూడా అదే రీతిలో పన్నులు వేస్తాం. ఇదే చాలా సరైన మార్గమని భావిస్తున్నా” అని ట్రంప్ చెప్పారు. అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌లో గత కొద్ది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను ‘రాజకీయ కారణాల’తోనే బైడెన్ ప్రభుత్వం అక్కడ వుంచేసిందని మస్క్ వ్యాఖ్యానించారు. త్వరలోనే తమ స్పేస్ ఎక్స్ సంస్థ వారిని తీసుకువస్తోందని చెప్పారు.