పబ్లిసిటీ వద్దు.. భద్రతకు ప్రాధాన్యతనివ్వండి అలా చేస్తే అనేక అంశాల్లో మెరుగుదల

– సమస్యలపై అధ్యయనం జరగాలి
– లేకపోతే సమగ్ర దర్యాప్తు జరగదు
– రైలు ప్రమాదాలన్నీ నివారించదగినవే : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : రైల్వేల విషయంలో మోడీ సర్కారు పబ్లిసిటీని పక్కన పెట్టి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అలా చేస్తే అనేక అంశాల్లో మెరుగుదల ఉంటుందని తెలిపారు. రైలు ప్రమాదాలన్నీ నివావరించదగినవే నని అన్నారు. కేంద్రం ప్రచా రార్భాటాలతో సంపన్నుల కోసం కాకుండా ప్రయాణికులకు మౌలిక వసతులు అందించాలని సూచిం చారు.
ఒడిశా ప్రమాద ఘటన నేపథ్యంలో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రైల్వేలో అనేక అంశాలు ఏండ్లుగా విస్మరించబడుతున్నాయనీ, ఈ కారణంతోనే ప్రమాదాలు చేసుకుంటున్నాయని అన్నారు. దేశంలో రైల్వేలు సురక్షితంగా లేవని అన్నారు. రైల్వేలో గ్యాంగ్‌మెన్‌ది కీలక స్థానమనీ, వారిపై పని భారం రెట్టింపు కావటం వలన వారిలో సామర్థ్యం తగ్గుతున్నదని చెప్పారు. సిగల్‌ వ్యవస్థ కూడా సుదీర్ఘ కాలంగా ప్రశ్నార్థకంగానే ఉన్నదని తెలిపారు. రైల్వే శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ సమస్యను, సిగలింగ్‌ వ్యవస్థను తక్షణమే పరిష్కరించాలని తన నివేదికలో హెచ్చరికలు చేసిందని, అయితే అలా జరగలేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా 2022 బడ్జెట్‌ కేటాయింపుల్లో ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపుల్లో 14 శాతం కోత విధించారన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు పెంచామని చెబుతున్న ప్రకటనలపై ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ”రైల్వే భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన కంటే పబ్లిసిటీ కోసం ప్రారంభించే రైళ్ల మీద ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎన్ని రైళ్లను ప్రారంభిస్తే అంత ఖర్చు చేయాల్సి వస్తున్నది. దానికి బదులు బడ్జెట్‌ను పెంచాలి. బడ్జెట్‌లో కేటాయించిన డబ్బు ఎటు పోతున్నదనేదే ప్రశ్న” అని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో శతాబ్ది, రాజధాని వంటి హైస్పీడ్‌ రైళ్లుఉన్నాయని వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఉటంకిస్తూ ఆయన తెలిపారు. దశాబ్దాలుగా రైల్వే ట్రాక్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నదనీ, బుల్లెట్‌ రైళ్ల లోడ్‌ను, స్పీడ్‌ను అవి భరించగలవా? అని అన్నారు. రైల్వేలో 3.12 లక్షల పోస్టులు ఖాళీగానే ఉన్నాయని తెలిపారు. సమగ్ర విచారణలోనే ఒడిశా ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయన్నారు. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వ్‌ కంపార్ట్‌మెంట్‌లో జనాలు కిక్కిరిసిపోయి ఉన్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని తెలిపారు. రిజర్వ్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించిన ఇతరుల వివరాలు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ” ధనిక, పేద అందరూ ఒకే రైలులో ప్రయాణిస్తారు. అయితే, పేదలు ప్రయాణించే ప్యాసింజర్‌ రైళ్లను తొలగిస్తూ.. వారు భరించలేనటువంటి హైస్పీడ్‌ ట్రైన్ల పైనే దృష్టి పెడుతున్నారు. ఇలా భారత రైల్వేలోనూ ఇద్దరు భారతీయులను తయారు చేస్తున్నారు” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ” భారతీయ రైల్వే అనేది కోట్లాది మందికి ముఖ్యంగా పాలు, కూరగాయలు అమ్ముకునేటువంటి కార్మిక జీవులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. అయితే, వారిని పట్టించుకోకపోవటం కారణంగానే రిజర్వ్‌ బెర్తుల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పబ్లిసిటీ కోసం ప్రారంభించే రైళ్లను సంపన్నులు మాత్రమే ఉపయోగించుకోగలుగుతారనీ, వీటి మీద దృష్టిని సారించటం కంటే సాధారణ ప్రయాణికులకు వసతులు కల్పించటంపై దృష్టి సారించాలి” అని తెలిపారు.
ఒడిశా ఘటనలో మృతదేహాల గుర్తింపు విషయం అమానవీయంగా ఉన్నదన్నారు. ఒడిశా ప్రమాదంలో సహాయ చర్యలు ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉండాలనీ, క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పారు. భారతీయ రైల్వేను ప్రయివేటీకరణ చేయడం లేదన్న ప్రభుత్వ ప్రకటనలు గిమ్మిక్కనీ, రైల్వేకు ఉన్న అనేక భూములను ప్రయివేటు వ్యక్తులకు అమ్మడం, లీజుకివ్వటం జరుగుతున్నదని అన్నారు. ప్రభుత్వం పబ్లిసిటీ మీద కాకుండా రైల్వే భద్రతకే ప్రాధాన్యతనిస్తే అనేక అంశాల్లో మెరుగుదల కనిపిస్తుందన్నారు. సమస్యల పట్ల అధ్యయనం జరగనంత వరకు తాజా ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగదని తెలిపారు.

Spread the love