‘నో స్మోకింగ్‌ ప్లీజ్‌…’

సిగరెట్‌ తాగకు రా… ధూమపానం మానరా..! కాళిగా… అని ఎన్ని సార్లు ప్రాధేయపడి ఉంటానో లెక్క లేదు. నేను ఇంటర్‌ చదివే రోజుల్లో నా ఆప్త మిత్రుడు ఎస్‌ కాళీ వరప్రసాద్‌ను ఆత్మీయంగా అడుక్కునే వాణ్ణి. ఇంటరయ్యాక కాళీ కానిస్టేబుల్‌ ఆయ్యాడు. ఓ పదేళ్ళ తర్వాత సికింద్రాబాద్‌ తిరుమల్‌గిరి చౌరస్తా మీదుగా మా ఊరు మేడ్చల్‌ జిల్లా కేశవరం వెళ్తున్నాను. అక్కడ ఎడమ పక్క ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఉంది. దానికి సమీపంలో ఉన్న పాన్‌ డబ్బాలో మా అమ్మకు ఇష్టం అని క్రేన్‌ వక్కపొడి కొంటున్న. ఇంతలో వీపుపై దెబ్బ పడింది. ఎవడ్రా అని వెనుతిరిగి చూస్తే… కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఇంకెవరు ఇంటర్‌ దోస్తు దీక్షితులు. ఏరా ఎలా ఉన్నావన్నా… ఏముంది, రాంగ్‌ రూట్లో వచ్చే వాళ్లకు నేను చలానా వేస్తే… పైవాడు నాకు చలానా వేశాడు రా అన్నాడు. అంటేచ అర్థం కాలేదు రా అన్నా. అదేరా… నువ్వు ఊకే నస పెట్టేవాడిని కదా! దమ్ము కొట్టకు రా అని, నేను వినలేదు ఇప్పుడు కూడా సిగరెట్‌ల కోసమే వస్తె నువ్వు కలిశావన్నాడు. కానీ అప్పుడు నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు టికెట్‌ తీసుకుని ”వెళ్ళడానికి” రెడీగా ఉన్నా. క్యాన్సర్‌ అనే వీసా, అనారోగ్యం అనే పాస్‌ పోర్టుతో అన్నాడు అంతే సరదాగా. నాకు నమ్మ బుద్ది కాలేదు. ఏ నిజం కాదు కదు నువ్వు అబద్దం చేపుతున్నావు అని సందేహించా. సరే మళ్లీ కలుద్దాం అని చెప్పి నాకు ఇష్టం అని ఓ మీనాక్షి పాన్‌ కట్టించి నోట్లో పెట్టీ మరీ ఆలింగనం చేసుకున్నాడు. ఏడుపును ఆపుకోలేక దుఃఖాన్ని దిగమింగుకోని కేశవరం వచ్చేశా. మరో ఏడాది ఇట్టేగడచి పోయింది. ఓ రోజు మాతో పాటే ఇంటర్‌ బాగ్‌లింగంపల్లి అంబేద్కర్‌ కాలేజీలో చదివిన స్నేహితుడు, బంధువు గద్దె వెంకటనరసింహ వద్దకు వెళ్ళా. ”మాచన” కాళి గాన్ని చూసొచ్చావా? అన్నాడు. వెంటనే ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పేరిట వైద్యానికి అంత సులువుగా లొంగని క్యాన్సర్‌తో పోరాటం చేసిచేసి అలసి సొలసి ఊపిరాడక పొగాకు పగకు బలి కాబోతున్న ఆప్తమిత్రుడు అంపశయ్యపై కనబడ్డాడు. పొగకు చిక్కి శల్యమై రఘు జీతం నుంచి రిటైర్‌మెంట్‌ కాకముందే… జీవితం నుంచి రన్‌ అవుట్‌ అవుతున్నా…రా అన్నాడు. ‘నీకేం కాదురా’ అన్నా వినడే. నీతో పాటు డిగ్రీ చదివి ఉంటే నీ నస భరించలేక సిగరెట్‌ మానేసే వాణ్ణి అన్నాడు. నాదో చివరి కోరిక తీర్చరా అన్నాడు. చెప్పరా… నా కాలేయం ఇవ్వనా అన్నా… చచ్చే వానికి నీ కాలేయం ఎందుకు గానీ, నీకు చదువుకు సాయం చేశా అన్నవే… అందుకు బదులుగా నాకోసం సమాజానికి సాయపడు. నాకు పదేపదే చెప్పావు కదా! సిగరెట్‌ మాను అని, అదే మాట రోజూ ఒక్కరికో ముగ్గురికో చెప్పు… చెప్తా అని మాట ఇస్తే… చాలు తృప్తిగా ”వెళ్ళి పో..తా” అన్నాడు. సరే అని చేతిలో చెయ్యి వేసి… మనసా వాచా కర్మనా ప్రమాణం చేస్తున్నా. ఇకపై మరే మిత్రుడు స్మోకింగ్‌ మూలంగా తన స్నేహితున్ని కోల్పోకుండా నాకు చేతనైన మేరకు చెపుతూనే ఉంటా ఆని ప్రతిజ్ఞ చేశా. అని మిత్రుని ఆత్మకు ఆత్మీయంగా సమర్పించి. వచ్చేశా ఓ రెండు వారాలు నిద్ర పట్టలేదు, అన్నం తిందాం అంటే ఆకలి కాదే. వాణ్ణి తలచుకుంటే గుండె తరుక్కుపోయేది. కాలేజీకి వెళ్తే లాక్కెళ్లి టిఫిన్‌ పెట్టించేవాడు. ఆకలిగా లేదురా అంటే ఇడ్లీ చట్నీతో అమ్మ లా తినిపించే ఒకే ఒక్క మిత్రున్ని పొగాకు పొట్టన పెట్టుకుంది అన్న వాస్తవం కలచి వేసింది. మైత్రి అనేదే తెలియని నాకు స్నేహా మాధుర్యం ఇలా ఉంటుంది అని, చెప్పిన నేస్తం పోయాక ఓ ఆర్నెళ్లు మతి పోయింది. ఎవరైనా సిగరెట్‌, పొగ, తాగుతూ కనిపిస్తే అతనే కనిపించి, చెప్పరా అతనికి దమ్ము కొట్టొద్దు అని ప్రాధేయ పడ్డట్టు అనిపించేది. వెంటనే వెళ్ళి ‘సార్‌… దయచేసి చేతులు జోడించి ప్రార్థిస్తున్నా దమ్ము కొట్టకండి ప్లీజ్‌’ అని ప్రార్థించే వాణ్ణి. ఈ కృషి ఇలా ఉండగా… కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వాళ్ళు నా సమాజ సేవా తపన గమనించి ఒపీనియన్‌ లీడర్‌గా 2009లో ప్రోత్సహించారు. ఈశాన్య భారతం చూసి వచ్చే అరుదైన అవకాశం దక్కింది. ఆ టూర్‌ నుంచి వచ్చాక సాక్షి పాత్రికేయుడు నా ఇంటర్వూ రాశాడు. ధూమపానం, గుట్కా నిషేధం అతని లక్ష్యం అని ఆ వార్త కథనం. పొగాకుపై పోరు ప్రస్థానం మరింత బాట వేసింది. నేను ఎక్కడ కనిపించినా అడిగే వాళ్ళు ‘బాబూ ఎన్నో జీవితాల్లో వెలుగు నింపుతున్నావు. నువ్వు కారణ జన్ముడివి’ అని ఆశీర్వదించే వాళ్లు. నా పెళ్లి అయ్యేటప్పుడు కూడా మధ్యవర్తిగా ఉన్న మా మామ అంబటి లక్ష్మీ నారాయణ ఓ స్లోగన్‌తో నన్ను ప్రమోట్‌ చేసేవారు. అబ్బాయికి ఏ అలవాట్లు లేవు. వాడికి మీ పిల్ల నచ్చడమే గొప్ప అని చెప్పే పెళ్లి కుదిర్చాడు. ఏంది… ఏ అలవాట్లు లేవు అనేది అది నీ క్వాలిఫికేషన్‌ లా… ఉందే అంటే అవును… నేను ఇంతే అని చెప్పా. వెడ్టింగ్‌ కార్డులో కూడా ‘మాచన సూచన’ అని ఓ మాటను అచ్చు వేయించా. నా పెళ్లికి వచ్చే వాళ్లకు పొగాకు ధూమపానం అలవాటు ఉంటే రావద్దు అని. అదేంటి అని నాకు కాబోయే శ్రీమతి అడిగింది. ‘మతి ఉన్నోడు దమ్ము కొట్టడు. ధూమపానంకు ప్రాణం బలి పెట్టడు. అమ్మా నాన్నలకు పుత్రశోకం పెట్టడు’ అన్నా. నా అభిప్రాయం తప్పు అని భావిస్తే… వీడు నాకు కరెక్ట్‌ కాదు అనుకుంటే… నా బదులు వెరొకర్ని పెళ్లిచేసుకో అని చెప్పా. జనం కోసం నువ్వు ఆలోచించడమే నాకు బాగా నచ్చింది అని మూడు ముళ్లు వేయించుకుంది. మీ ఆయన ఏమ్‌ చేస్తారమ్మ అని వారి తరపు చుట్టాలు అడిగితే. పొగాకుపై పోరాటం చేస్తాడు అని గర్వంగా చెప్పింది. అదే స్ఫూర్తితో నేటితరానికి నేను చెప్పేదొకటే ‘నో స్మోకింగ్‌ ప్లీజ్‌’.
(నేడు ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం)
– మాచన రఘునందన్‌

Spread the love