నిల్వ నీడ లేదు..తాగేందుకు నీళ్లు లేవు..!

ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ‘ఉపాధి’ కూలీలు కేంద్రం విధానంతో ఇబ్బందులు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువు
 మౌలిక వసతులపై దృష్టి సారించని యంత్రాంగం
నవతెలంగాణ-చివ్వెంల
వేసవి కావడంతో ఉపాధిహామీ కూలీలు ఎండల్లో మాడిపోతున్నారు. పని ప్రదేశాల్లో కాసేపు సేద తీరేందుకు నీడ.. తాగేందుకు నీళ్లూ లేక.. కూలీలు అల్లాడుతున్నారు. కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైతే ప్రాథమిక వైద్యం కూడా అందని పరిస్థితి. ఇండ్ల నుంచే తాగునీరు పట్టుకెళ్లినా.. అవి అయిపోతే దప్పికతో ఇబ్బందులు పడాల్సిందే. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కూలీలు పని చేసే ప్రాంతాలవైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. కొలతల్లో తేడాలుంటున్నాయని డబ్బుల్లో కోత విధిస్తున్న అధికారులు.. చట్టపరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉపాధి కూలీలు వడదెబ్బ బారిన పడుతున్నారు. కొందరు మృతి చెందుతున్న పరిస్థితీ ఉంది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల వ్యాప్తంగా 11 వేల పైచిలుకు ఉపాధికూలీలు ఉన్నారు. సుమారు 5 వేల మంది కూలీలు పని చేస్తున్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం రెండు సార్లూ కూలీల ఫొటోలు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. అలా అయితేనే కూలీలకు రోజువారీ పూర్తివేతనం అందుతుంది. కూలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తోంది. ఆయా ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్‌, ప్రాథమిక చికిత్స.. తదితర సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ సౌకర్యాలను కల్పించేందుకు ప్రత్యేకంగా మేట్లకు బాధ్యతలు అప్పగించేవారు. రెండేండ్ల కిందట కొంతవరకు ఈ సౌకర్యాలు బాగానే అమలైనా.. క్రమక్రమంగా ఈ చట్టానికి కేంద్రం నిధుల్లో కోతలు విధించుకుంటూ పోతుండటంతో సౌకర్యాలు కుంచించుకుపోతున్నాయి. పర్యవేక్షించాల్సిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పట్టించుకోకపోవడం.. ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించకపోవడం మూలంగా కూలీలు అవస్థలు పడుతున్నారు. పైగా మూడునెలలుగా కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కొందరికి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్‌ లింకు లేకపోవడంతో డబ్బులు చెల్లించడం లేదు.
పిట్టల్లా రాలుతున్న కూలీలు
రోజురోజుకు ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. కానీ పేదలకు ఉపాధిహామీ పనులే ఆసరాగా నిలుస్తున్న ఫలితంగా ఎండ తీవ్రత ఉన్నప్పటికీ పనికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పటి వరకు కేవలం చివ్వెంల మండలంలోనే సుమారు ఐదు నుంచి పది మంది వరకు వడదెబ్బ కారణంగా మృతి చెందారు. రెండురోజుల కిందట మోతెకు చెందిన సురేష్‌.. ఉపాధిహామీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాగానే అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఇప్పటికే ఆయా మండలాల్లో పలువురు మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఎండలో పనిచేస్తూ అనేక మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలవుతున్నా, మరణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
నిలిచిపోయిన అదనపు భత్యం..!
ఉపాధిహామీ పనుల కోసం అవసరమైన పరికరాలను ప్రభుత్వం ఇదివరకు సరఫరా చేసేది. గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, గొడ్డళ్లు, కొడవళ్లను సైతం అందించేది. క్రమంగా వాటి సరఫరా నిలిపివేయడంతో కూలీలే సొంతంగా ఆయా పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తాగునీటి కోసం గతంలో కూలీలకు రూ.5 చెల్లించేవారు. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల్లో పనిచేసే కూలీలకు 20శాతం అదనపు భత్యం కూడా చెల్లించేవారు. కానీ కేంద్రం ఇటీవల నూతన సవరణలు తీసుకొచ్చి ఈ రెండు ప్రయోజనాలను నిలిపివేసింది. దాంతో కనీస సౌకర్యాలు లేకపోవడం.. ప్రయోజనాలు దూరం కావడంతో కూలీలు సైతం పనులకు వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ఉపాధి కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టేందుకు కారణమవుతోంది. ఉదయం పనులకు వెళ్తే సుమారు నాలుగు గంటలు ఎండలోనే పనిచేయాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, టెంట్‌, ప్రాథమిక చికిత్స పెట్టె.. లాంటి సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో పనికి వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని ఉపాధి కూలీలు కోరుతున్నారు.
పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ వేతనాలను వెంటనే విడుదల చేయాలి. ఉపాధికూలీలకు వేసవి అలవెన్స్‌ కేటాయించాలి. పే స్లిప్పులివ్వాలి. పని ప్రదేశాల్లో టెంట్‌, ప్రథమ చికిత్స చేయటానికి సౌకర్యాలు కల్పించాలి. కొత్త జాబ్‌కార్డులు మంజూరు చేయాలి.
వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి-మట్టిపల్లి సైదులు

త్వరలో పెండింగ్‌ బిల్లులు విడుదల
కేంద్రం ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ మార్చడంతో ఉపాధిహామీ అలవెన్స్‌లు రావడం లేదు. వేసవిలో పని ప్రదేశాల వద్ద ఉపాధి కూలీలు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు పని పూర్తి చేసుకోవాలి. పెండింగ్‌ వేతనాలు త్వరలో విడుదలవుతాయి. సౌకర్యాలపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తాం.
డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌

Spread the love