– వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ప్రదర్శనలపై స్టే ఇవ్వని బెంచ్
న్యూఢిల్లీ : మతోన్మాద హింస చోటు చేసుకున్న హర్యానాలోని నహ జిల్లాలో విహెచ్‌పి, బజరంగ్‌దళ్ సంస్థల ”ప్రదర్శనలపై” సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ బుధవారం స్టే ఇవ్వలేదు. అయితే, ఎలాంటి హింస జరగకుండా, ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, పోలీసులను కోరింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ”ద్వేషపూరిత ప్రసంగం వాతావరణాన్ని దెబ్బ తీస్తుందనే అంశంపై ఎలాంటి తగాదా వుండరాదు. ఎలాంటి హింస జరగకుండా, విద్వేష ప్రసంగాలు చేయకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధిత రాష్ట్ర అధికారులతో కేంద్రం వెంటనే మాట్లాడాలి. చట్టబద్ధ పాలన నెలకొనాలి.” అని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. ప్రదర్శనల సందర్భంగా శాంతి భద్రతల పరిస్థితులకు విఘాతం కలగకుండా చూసేలా కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి, సంప్రదించుకోవాలని కోర్టు ఆదేశించింది. జరిగే ప్రదర్శనలు, సంఘటనలకు సంబంధించి సిసిటివి వీడియోలు తీయాలని, వాటిని భద్రపరచాలని కోరింది. బందోబస్తును పెంచాలని కోరింది. విద్వేష ప్రసంగాలు చేసేవారిపై ఎఫ్‌ఐఆర్‌లు
విద్వేష ప్రసంగాలు ఎవరైనా చేసిన పక్షంలో వారిపై ఫిర్యాదు దాఖలవడం కోసం వేచి చూడకుండా వెంటనే తము తాముగా పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను, రాష్ట్రాల అధికారులను కోరుతూ గతేడాది అక్టోబరు 21న జారీ చేసిన ఆదేశాలను బెంచ్ ఈ సందర్భంగా కేంద్రానికి గుర్తు చేసింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేస్తుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు హామీ ఇచ్చారు. కోర్టు ఆదేశాలకు తాము కట్టుబడి వుంటామని చెప్పారు.
పొరుగునున్న హర్యానాలో హింస జరుగుతోందని, రాజధానికి 23 నిరసన ప్రదర్శనలు వస్తున్నాయని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సి.యు.సింగ్ తెలిపారు. ఆ కార్యక్రమాలను ప్రదర్శనలుగా పేర్కొన్నప్పటికీ ఇప్పటికే విద్వేష ప్రసంగాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ‘విద్వేష ప్రసంగాలు జరుగుతున్నాయి. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో మరో ఐదు ప్రదర్శనలు జరగనున్నాయి’ అని సింగ్ చెప్పారు.
ఎక్కడా హింస పెచ్చరిల్లకుండా అధికారులు ముందు జాగ్రత్తతో వ్యవహరించాలని జస్టిస్ ఖన్నా సూచించారు. తమ అధికార పరిధిలో జరిగే ఎలాంటి హింసనైనా ఏ ప్రభుత్వమూ ఇష్టపడదని అన్నారు.
సుప్రీం కోర్టు అత్యవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ న్యాయవాది సింగ్ రెండు వేర్వేరు బెంచ్‌ల ముందు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ప్రాధాన్యతా ప్రాతిపదికన కేసును విచారణకు స్వీకరించారు. తిరిగి శుక్రవారం స్పెషల్ బెంచ్ దీనిపై విచారణ జరపనుంది.