వైద్యశాస్త్రంలో అమెరికన్‌ శాస్త్రవేత్తలకు నోబెల్‌

Nobel for American scientists in medicineస్టాకహేోం: అమెరికన్‌ శాస్త్రవేత్తలైన విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ సోమవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఎ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్‌ జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించినట్లు నోబెల్‌ బృందం పేర్కొంది. వివిధ కణ రకాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశంపై అధ్యయనంలో భాగంగా వీరు మైక్రో ఆర్‌ఎన్‌ఎను కనుగొన్నారు. ఇది, జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషించే అణువుల కొత్త తరగతి అని నోబెల్‌ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. జన్యు చర్యల నియంత్రణను అవగాహన చేసుకోవడమనేది అనేక దశాబ్దాలుగా కీలక లక్ష్యంగా వుందని, ఈ జన్యు నియంత్రణ గనక అవకతవకలతో సాగినట్లైతే కేన్సర్‌, మధుమేహం లేదా ఆటో ఇమ్యూనిటీ వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీయగలదని నోబెల్‌ అకాడమీ పేర్కొంది. వైద్యరంగం నుండి ప్రారంభమైన ఈ నోబెల్‌ బహుమతుల ప్రకటన అక్టోబర్‌ 14 వరకు కొనసాగుతుంది. వరుసగా అక్టోబర్‌ 8న భౌతిక శాస్త్రం, 9వ తేదీన రసాయన శాస్త్రం, 10వ తేదీన సాహిత్య విభాగం, 11వ తేదీన శాంతి బహుమతి, అక్టోబర్‌ 14వ తేదీన అర్థశాస్త్రంలో పురస్కారాలను ప్రకటిస్తారు. 10 లక్షల స్వీడిష్‌ క్రోనార్లు (సుమారు 9లక్షల డాలర్లు) నగదుతో పాటు అవార్డులను డిసెంబర్‌ 10న బహూకరిస్తారు.
అత్యున్నత పురస్కారం నోబెల్‌ పుట్టుక ఇలా…..
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా నోబెల్‌కు గుర్తింపు ఉంది. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, వ్యాపారవేత్త అల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ఈ నోబెల్‌ పురస్కారాన్ని ప్రవేశపెట్టారు. 1896లో ఆయన మరణించగా, ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 1901 నుండి మానవాళి ప్రయోజనాల కోసం విశేషంగా సేవలందించిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఆయన తన జీవితకాలంలో సంపాదించిన యావదాస్తిని ఒక నిధిగా ఏర్పాటు చేసి ఈ బహుమతులు అందజేస్తున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలు, వైద్య, సాహిత్య, రంగాలు, ప్రపంచ శాంతి కోసం పాటుపడిన వారికి ఈ అవార్డులు అందజేయాలని నోబెల్‌ తన వీలునామాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. నార్వే పార్లమెంట్‌ ఎంపిక చేసిన ఐదుగురు వ్యక్తులతో ఏర్పడిన కమిటీ నోబెల్‌ శాంతి బహుమతిని అందజేయాలని నోబెల్‌ తన వీలునామాలో పేర్కొన్నారు. 1897 ఏప్రిల్‌లో ఈ బాధ్యతను పార్లమెంట్‌ ఆమోదించింది. నోబెల్‌ గౌరవార్దం ఆర్థిక రంగంలో పురస్కారాన్ని 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా అందజేస్తున్నారు. నోబెల్‌ చనిపోయిన డిసెంబరు 10వ తేదీన ఈ బహుమతులను స్టాకహేోమ్‌లో జరిగే కార్యక్రమంలో అందచేస్తారు. అత్యున్నత పురస్కారమైన నోబెల్‌ బహుమతిని అందుకోవడం అత్యంత గౌరవప్రదంగా భావిస్తారు. జాతి, మత ప్రాంత వివక్ష లేకుండా మానవాళి ప్రయోజనాల కోసం విశేషంగా కృషి చేసేవారికి వీటిని ఇస్తారు. ఈ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేయడానికి ముందుగా సవివరమైన పరిశోధన జరుగుతుంది.

Spread the love