– రెండేళ్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ గిరి
– వడ్డెకొత్తపల్లిలో హర్షాతిరేకాలు
నవతెలంగాణ పెద్దవంగర:
ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెమరుగొమ్ముల సుధాకర్ రావుకు ఎట్టకేలకు నామినేట్ పదవి వరించింది. సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ఈ పదవిలో సుధాకర్ రావు రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. దీంతో ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల పరిధిలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎట్టకేలకు ‘డాక్టర్ సాబ్’ కు పదవి:
సుధాకర్ రావు తండ్రి యతిరాజారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 సార్లు ఎమ్మెల్యేగా, దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ, సుధాకర్ రావు వైద్య వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన 1999-2004 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మృదుస్వభావి, వివాదరహితుడు, ప్రముఖ వైద్యుడిగా పేరుగాంచారు. ఎండోక్రైనాలజిస్టుగా పలు సంస్థల్లో, వివిధ హోదాల్లో పనిచేశారు. 2015లో ఆయా రంగాల్లో చేసిన సేవలకు లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. 2010లో బీఆర్‌ఎస్ లో చేరిన ఆయన 2014 నాటి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి 2,700 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి టిక్కెట్ రాకపోవడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపు కోసం కృషి చేశారు. అప్పుడు తొలుత ఎమ్మెల్సీ పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ పదవి కాకపోవడంతో నిరాశ ఎదురైంది. అప్పటినుండి ఏ పదవి లేకుండా పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో స్థిరపడి వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో సుధాకర్ రావు కు ఎట్టకేలకు నామినేటెడ్ పదవి కట్టబెట్టారు.
వడ్డెకొత్తపల్లి లో హర్షాతిరేకాలు:
సుధాకర్ రావు కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ పదవి వరించడంతో వడ్డెకొత్తపల్లి గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత పదవి రావడంతో ఆయన వర్గీయులు సంబరాలు జరుపుకున్నారు. తమ నాయకుడికి పదవి రావడం పట్ల నాయకులు ముత్తినేని శ్రీనివాస్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, బొల్లు ఉషయ్య, వెంకన్న, రవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.