నామినేషన్లు షురూ

Nominations are in– తొలి రోజు వంద నామినేషన్లు
– తుమ్మల, రేవంత్‌రెడ్డి సహా పలువురు దాఖలు
– స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ
నవతెలంగాణ- విలేకరులు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొదటి రోజు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వంద నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. తొలిరోజు నామినేషన్లు వేసిన వారిలో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్‌ బలగాలతో పాటు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నామినేషన్లు వేసే అభ్యర్థులతో పాటు ప్రతిపాదించే వారిని మాత్రమే అనుమతించారు.
హైదరాబాద్‌ గోషామహల్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా మొగిలి సునీత నామినేషన్‌ దాఖలు వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. నిర్మల్‌ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ముధోల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణరావు పటేల్‌, బెల్లంపల్లిలో బీజేపీ అభ్యర్థి అమురాజుల శ్రీదేవి నామినేషన్‌ దాఖలు చేశారు. చెన్నూర్‌లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి సోగాల సంజీవ్‌, సిర్పూర్‌(టి) నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రావి శ్రీనివాస్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఆజాద్‌ అధికార సేన పార్టీ బలపరుస్తున్న ఇమంది ఉదరు కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గ ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు నామినేషన్‌ వేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదటి రోజు 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డిలో 7 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వికారాబాద్‌ జిల్లాలో 5 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు దాఖాలు చేశారు. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్‌గౌడ్‌ నామినేషన్లు వేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 11 నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్‌ తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు నామినేషన్‌ వేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. బీజేపీ పార్టీ తరుపున భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చందుపట్ల కీర్తిరెడ్డి నామినేషన్‌ దాఖలు వేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు తరపున ఆయన సతీమణి గణపురం జెడ్పీటీసీ గండ్ర పద్మ నామినేషన్‌ దాఖలు చేశారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎంసీపీఐ(యు) అభ్యర్థి పెద్దారపు రమేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 నామినేషన్లు దాఖలు అయినట్టు రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు.

Spread the love