– మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యూనివర్సిటీల్లోని టైమ్ స్కేల్, డైలీవేజ్, ఎన్‌ఎంఆర్, కంటింజెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర నాన్ టీచింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని తెలంగాణ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి ఆ యూనియన్ గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్, సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెట్టు రవి, వి.నారాయణ, ఉపాధ్యక్షులు మహేందర్, తదితరులు కలిసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలోని 18 వర్సిటీల్లో సుమారు 10 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయాల కార్యకలాపాల్లో నాన్‌టీచింగ్ సిబ్బంది పాత్ర చాలా కీలకమని రాష్ట్ర ప్రభుత్వమే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వారికి ఇచ్చే వేతనాల్లో చాలా వ్యత్యాసాలున్నాయనీ, మూడేండ్లుగా ఏజెన్సీల ద్వారానే నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు. యూనివర్సిటీలు నిర్ణయించిన కనీస వేతనాలే అతి తక్కువనీ, అందులోనూ ప్రభుత్వమిచ్చే దాంట్లో ఏజెన్సీలు పర్సెంటేజీలు తీసుకుంటుండటంతో చాలా తక్కువ అందుతుందని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో టైం స్కేల్ గ్రూప్-డి ఉద్యోగికి రూ.31వేలు, శాతవాహనలో రూ.26వేలు ఇస్తున్నారని తెలిపారు. డైలీవేజ్‌లో అటెండర్, స్వీపర్ కేటగిరీలో ఉన్నవారికి, గ్రూపు వర్కర్లకు రూ.16 వేలు, గార్డెనింగ్ వర్కర్‌కు రూ.13 వేలు, హాస్టల్స్‌లో కుక్‌కు రూ.10వేలు, హెల్పర్‌కు రూ.8వేలు చెల్లిస్తున్నారని వివరించారు. వేతనాల్లో ఈ వ్యత్యాలుండటం సరిగాదన్నారు. నాన్‌టీచింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరారు.