– సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ దగా
– టెండర్ల అక్రమాలపై విచారణకు సిద్ధం
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బోనస్ విషయంలో అంకెల గారడీ చేసి కార్మికులను మోసం చేశారని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి, సీఎం రేవంత్ చెప్పిన మాటలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. ”1999 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు పదేండ్ల పాటు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు 11 నుంచి 20 శాతం వరకు బోనస్‌ను పెంచి మొత్తం రూ.370 కోట్లు ఇచ్చింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2014లో సింగరేణి రూ.1,060 కోట్ల లాభాలను ఆర్జించింది. అందులో 21 శాతం బోనస్‌గా ప్రకటించగా వచ్చిన రూ.102 కోట్లను ఒక్కో కార్మికునికి రూ.17 వేలు ఇచ్చాం. 2018-19లో రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.లక్ష చెల్లించాం. 2023లో రూ.2,222 కోట్ల లాభాల్లో రూ.1.60 లక్షలు బోనస్‌గా అందజేశాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో 60,369 మంది సింగరేణి కార్మికులకు రూ.2,780 కోట్ల లాభాలను బోనస్ ఇచ్చాం. కాని దానికి భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ కార్మికులను మోసం చేసింది. డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఏడాది సింగరేణి రూ.4,701 కోట్ల లాభాలను గడించింది. అందులో 33 శాతం వాటా (రూ.1,551కోట్లు) కార్మికులకు ఇచ్చామన్నారు. కార్మికులకు 33 శాతం వాటా ఇస్తే ఒక్కొక్కరికి రూ.3.70లక్షల లాభం రావాలి. కానీ ప్రభుత్వం రూ.1.90లక్షలు మాత్రమే బోనస్‌గా ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం చూస్తే కేవలం 16.2శాతం లాభాల్లో వాటాగా ఇచ్చి, 33 శాతం అని మభ్యపెడుతున్నారు. ఇది ముమ్మాటికీ కార్మికులను దగా చేయడమే అవుతుంది. దీనిపై సీఎం నేరుగా సమాధానం చెప్పాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందనీ, కాంగ్రెస్ దానికి సహకరిస్తోందని ఆరోపించారు. సింగరేణి లాభాల వాటాపై కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.. సింగరేణి అధికార గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పాటు, సీపీఐ, బీజేపీ నేతలు ఈ అంశంలో స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జి, లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేవలం రూ. రెండు కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ.1,000 కోట్ల కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా జరిగిన తప్పును ఒప్పుకొని జరిగిన టెండర్లను సీఎం వెంటనే రద్దు చేయాలని డిమండ్ చేశారు. అమృత్ నిధుల విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజరు నుంచి మొదలుకొని ఒక్క ఎంపీ కూడా ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామనీ, సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు చెప్పి, న్యాయస్థానంలో మాత్రం అలాంటిదేమి లేదని తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పు దోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, అధికారికంగా మాత్రం చేర్చుకోలేదని చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవినీతి, అవకాశవాదాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనీ, తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.