– ఐదేండ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీక్
– విశ్వసనీయత కోల్పోయిన ఎన్‌టీఏ
– విద్యార్థుల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం, అసహనం
ఎలాంటి లోపాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రవేశ పరీక్షలను నిర్వేహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఏర్పాటు చేశారు. అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ సంస్థ ఏర్పడిందో దానిని నెరవేర్చడంలో మాత్రం పదే పదే విఫలమవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణే సీఎస్‌ఐఆర్-యూజీసీ-నెట్ పరీక్ష వాయిదా. ఈ పరీక్షను శుక్రవారం రాత్రి వాయిదా వేశారు. ఈ నెల 25-27 తేదీల మధ్య జరగాల్సిన ఈ పరీక్షను ‘వనరుల కొరత’ కారణంగా వాయిదా వేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఈ పరిణామం ఎన్టీఏ విశ్వసనీయత, సామర్ధ్యంపై విద్యార్థుల్లో అనుమానాలను పెంచుతోంది. పరీక్షల పట్ల విశ్వాసాన్ని పెంచడానికి ఏర్పడిన సంస్థ ఇలా విశ్వసనీయతను కోల్పోవడానికి కారకులెవరన్న ప్రశ్న తలెత్తుతోంది.
న్యూఢిల్లీ : విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. గత ఐదు సంవత్సరాల కాలంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్…ఇలా పదిహేను రాష్ట్రాల్లో 41 నియామకాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. పరీక్షా పత్రాల లేకేజీలో ఇది ఓ విపత్తు వంటిది. ఈ లీకేజీల కారణంగా పెద్ద రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. నీట్ పరీక్షకు సంబంధించి జరుగుతున్న నిరసనలు విద్యార్థుల ఆగ్రహానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
విద్యార్థుల ఆగ్రహం
సంవత్సరమంతా కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై పరీక్షలకు సిద్ధమైతే తీరా అవి లీక్ కావడం విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఆగ్రహాన్ని, అసహనాన్ని పెంచుతోంది. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం నష్టం చేస్తున్నప్పటికీ ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఒకసారి పొరబాటు జరిగితే దానిని దిద్దుకోవాల్సింది పోయి పదే పదే పునరావృతం చేయడం ఏమిటని విద్యార్థులు నిలదీస్తున్నారు. పేపర్ లీకేజీల కారణంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులు నష్టపోతూనే ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయకపోతే కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసినవారు అవుతారు. నీట్ పరీక్ష జరిగిన 47 రోజుల తర్వాత ఎన్టీఏ పనితీరును మెరుగుపరచేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలు సమస్యకు మూలం ఎక్కడ ఉన్నదో దానిని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
2018లో ఆవిర్భావం
ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు 2017లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు తావులేకుండా చూసేందుకే దీనిని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంది. 2018 మార్చి 1న ఎన్టీఏ మనుగడలోకి వచ్చింది. అప్పటి నుండి ఈ సంస్థ పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. కానీ పలు సందర్భాలలో వాటి నిర్వహణ లోపభూయిష్టంగానే ఉంటోంది. పేపర్ లీకేజీలతో పరీక్షలు రద్దవడం. వాయిదా పడడం నిత్యకృత్యంగా మారిపోయింది.
నీట్‌పై గ్యారంటీ ఇస్తారా?
నీట్ పరీక్ష నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. పరీక్ష రద్దయినా కాకపోయినా ఇబ్బంది పదేది మాత్రం విద్యార్థులే కదా. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోమని విద్యా శాఖ చెబుతోంది. అయితే ప్రాథమిక విచారణ అనంతరం నెట్ పరీక్షను రద్దు చేసిన విషయాన్ని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. నీట్ విషయంలో అలా ఎందుకు జరగకూడదని వారి ప్రశ్న. తదుపరి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ కాబోదని గ్యారంటీ ఏముందని నెట్‌కు హాజరైన విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నియామక పరీక్ష అయినా…ప్రవేశ పరీక్ష అయినా ప్రతి విద్యార్థి పేపర్ లీకేజీ, రిగ్గింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.
ఫిర్యాదులు…ఆరోపణలు
ఎన్టీఏ ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం పరీక్షల రిగ్గింగ్‌పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 2019లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష సందర్భంగా సర్వర్ వైఫల్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రశ్నాపత్రం ఇవ్వడంలో జరిగిన జాప్యంపై కూడా కొన్ని చోట్ల ఫిర్యాదులు వచ్చాయి. 2020లో జరిగిన నీట్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ పనితీరుపై పలు ప్రశ్నలు ఉదయించాయి. ఈ పరీక్షను అనేక సార్లు వాయిదా వేశారు. అవకతవకలపై కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. 2021లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు వచ్చిన కొన్ని తప్పుడు ప్రశ్నలపై గందరగోళం చెలరేగింది. అవాంఛనీయ పద్ధతుల ద్వారా పరీక్షలో ఉతీర్ణత సాధించేందుకు విద్యా మాఫియా ప్రయత్నించిందంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సంవత్సరంలోనే నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్‌లోని భంక్రోటాలో ఓ ముఠా ట్యాంపరింగ్‌కు పాల్పడిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం 2022లో నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో సైతం అవకతవకలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఎక్కువ ఫిర్యాదులు రాజస్థాన్ నుండి వచ్చినవే. ఆ తర్వాత ఎన్టీఏ కొన్ని ప్రాంతాల్లో మళ్లీ పరీక్ష నిర్వహించింది.
ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేస్ మార్పులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో బీహార్‌లో పేపర్ లీక్ అయిందన్న వార్త వెలుగు చూసింది. దీంతో ఎన్టీఏ విశ్వసనీయత, జవాబుదారీతనం ప్రశ్నార్థమవుతున్నాయి. ఈ నెల 18న జరిగిన యూజీసీ-నెట్ పరీక్ష రద్దయింది. ఎన్టీఏ ఏర్పడిన తర్వాత 2018, 2023 సంవత్సరాల్లో మాత్రమే పేపర్ లీకేజీలు, అవకతవకలకు సంబంధించి ఆరోపణలు రాలేదు.
లీకేజీపై రాజకీయం
ఓ వైపు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతుంటే మరోవైపు పేపర్ లీకేజీలపై రాజకీయాలు మొదలయ్యాయి. నీట్ ప్రశ్నాపత్రం బీహార్‌లో లీక్ అయింది. నీట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అమిత్ ఆనంద్ పేపర్‌ను లీక్ చేయగా రెండో నిందితుడైన సికందర్ యాదవేందు ఆ పేపర్‌ను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత పలువురు విద్యార్థులు ఆ ప్రశ్నాపత్రాన్ని రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రదీప్ కుమార్ నిందితులైన విద్యార్థుల కోసం అతిథి గృహంలో ఓ గదిని బుక్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. పేపర్ లీకేజీ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తొలుత తేజస్వి యాదవ్ పైనే ఆరోపణలు చేశారు. అయితే నిందితుడిని ప్రభుత్వం రక్షించాల్సిన అవసరం లేదని, తన వ్యక్తిగత సహాయకుడిని పిలిచి విచారించవచ్చునని తేజస్వి స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ గతంలో కూడా అనేక ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన ఘనుడు. లీక్ చేసిన ఒక్కో ప్రశ్నాపత్రాన్ని లక్షలాది రూపాయలకు సికందర్‌కు అమ్మేశానని అమిత్ అంగీకరించాడు.
నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా
త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తాం.. కేంద్ర వైద్యారోగ్యశాఖ
జూన్ 23న (ఆదివారం) నేడు దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్ష వాయిదా పడినట్టు తెలుస్తోంది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.