గ్రామ ఉద్యోగి కాదు..రాజకీయ నాయకుడు.?

– ఆ గ్రామ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర!
– గ్రామ సమస్యలను పట్టించుకోడు కానీ ప్రతి పంచాయితీ లో తలదూర్చడం..
– పెండ్లికి స్థానిక వెంచర్ నుండి రూ.2 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు..
– గతంలో వృధ్యాప్య పెన్షన్ నగదు వాడుకున్నాడని విమర్శలు..
– ఉన్నతాధికారులను సైతం లెక్కచేయని ఉద్దండుడు..
– ఇటీవల మండలంలో నీటి ఎద్దడి సమావేశానికి వెళ్లి మండల ఉన్నతాధికారిని తోటి ఉద్యోగుల ముందే విమర్శలలు చేసి నట్లు ఆరోపణలు ?
– ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఓటేస్తే పెన్షన్, ఇండ్లు రావని తన వంతు ప్రచారం?
నవతెలంగాణ – చివ్వెంల
మండల పరిధిలోని విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారి కి సమీపంలో ఉన్న  గుంజలూర్ గ్రామంలో పనిచేసే గ్రామస్థాయి ఉద్యోగి అప్పటి అధికార పార్టీ రాజకీయ నాయకుడిగా అవతారామెత్తాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి .. ప్రస్తుతం కూడా అప్పటి నాయకుల లబ్దికోసం తహతహలాడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి ….ఆ అధికారి గ్రామ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తు..గ్రామ సమస్యలను పట్టించుకోడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కానీ గ్రామంలో  ప్రతి చిన్న పంచాయితీ విషయంలో తలదూర్చడం ఇతనికి పరిపాటిగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి …ఇతని ఆగడాలు అన్నీ ఇన్నీ కావు…కర్ణుడికి ఉన్న పాపాలు ఎన్ని ఉన్నాయో ఇతనివి కూడా అంతకంటే  ఎక్కువే ఉంటాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతని పెండ్లికి వెంచర్ నుండి రూ.2లక్షలు, మద్యం  వసూళ్లు..
గ్రామంలో కొన్నేళ్లుగా గ్రామస్థాయి అధికారిగా చెలామని అవుతున్న ఈ అధికారి గతంలో పాలించిన పాలకవర్గం కు ఇతను వెన్నుదన్నుగా నిలిచాడు..ఓ అధికారిగా కాకుండా గత అధికార పార్టీ నాయకుడిగా చెలామణి అయ్యాడనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వివాహానికి ముందే ఇతనికి ఉద్యోగం రావడంతో గుంజలూర్ గ్రామంలో పోస్టింగ్ వచ్చిన తర్వాత ఇతనికి గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది.. ఈలోపు ఇతనికి అదృష్టం వరించి నట్లు ఇతని వివాహ సమయానికి ముందు గ్రామ స్టేజీ వద్ద సుమారు 65 ఎకరాలకు పైగా ఓ వెంచర్ వెలిసింది. దీంట్లో కొన్ని అక్రమాలకు పూర్తిగా మద్దతుగా ఈ అధికారి నిలవడంతో తన వివాహానికి రెండు లక్షలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం తో  దీంతో స్థానిక అధికారి డిమాండ్ కు తలొగ్గి రూ.2లక్షలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. నగదు వసూలు చేయడమే గాక,  పెళ్లికి కొందరు వీఐపీలు వస్తారని,  గ్రామానికి చెందిన కొందరు నాయకులు వస్తారని,  వారందరికీ కొంత మద్యం కావాలని రూ.50 వేలకు పైగా మధ్యాన్ని వసూలు చేసి దావాత్ ఇచ్చినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
వృధ్యాప్య పెన్షన్ లు సైతం ఖతం..?
ఇతను గుంజలూరు గ్రామానికి వచ్చిన ఒక సంవత్సరం పాటు స్తబ్దుగా పని చేసినప్పటికీ, ఏడాది దాటిన తర్వాత ఇతని విశ్వరూపం చూపించ సాగాడనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడున్న అధికార పార్టీ పేరు చెప్పుకునే చోటా, మోటా నాయకులవెంట  తిరగడం వచ్చిన ప్రభుత్వ అధికారులను బెదిరించడం ఇతనికి అలవాటుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో తనని ఎవరు ఏం చేయలేరని భావించి కొందరి వృధ్యాప్య  పెన్షన్ సొమ్మును కాజేసి తన స్వంత అవసరాలకు వాడుకున్నాడని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి… దీంతో ఇతని ఆగడాలను, అక్రమాలను గుర్తించిన సదరు గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. అయినా అప్పటి అధికార పార్టీ నాయకుల సహకారంతో ఇతనిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేశారనే విమర్శలు ఉన్నాయి.
ఉన్నతాధికారులను సైతం లెక్కచేయని ఉద్దండుడు..
ఇతనికి ఎంత అహంకారం అంటే ఉద్యోగ బాధ్యతగా ఉండాల్సిన ఇతను కనీసం పై అధికారులను సైతం లెక్కచేయడనే తోటి ఉద్యోగులే గుసగుసలు ఆడుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం  మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నీటి ఎద్దడిపై అధికారులు సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం . అక్కడికి వచ్చిన సమావేశ మందిరంలో రాకుండా తోటి ఉద్యోగులతో మాట్లాడుతుండగా కార్యాలయ సిబ్బంది పై అధికారి వచ్చాడు.. రండి అని పిలిచారు. వెంటనే ఈ అధికారి 10 మందికి పైగా ఉన్న తోటి ఉద్యోగుల ముందే ” ఈ ఎండలకు ఎవరెవరో చస్తున్నారు… మన సార్ కు చావు రావట్లేగా”  అంటూ వెళ్లిపోతుండగా తోటి ఉద్యోగుల్లో కొందరు అలా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి వారించి సమావేశానికి వెళ్లారని సమాచారం.
కాంగ్రెస్ కు ఓటేస్తే పెన్షన్ కట్ అంటూ ఎలక్షన్ ముందు ప్రచారం?
వాస్తవానికి గుంజలూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండడం తో.. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకుండా అసెంబ్లీ ఎలక్షన్ ముందు అన్ని రకాల వ్యవస్థలను అప్పటి అధికార పార్టీ నాయకులు గ్రామంలో ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి . పోలీసు, రెవెన్యూ, పథకాల కు సంబంధించి అన్ని రకాల ప్రయోగాలు చేశారని గ్రామస్తులే బహిరంగంగా  ఆరోపిస్తున్నారు. దీంట్లో భాగంగా  అధికారి పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో పెన్షన్, ఇండ్లు, దళిత బంధు, ఉచిత బియ్యం, ఉపాధి హామీ లాంటి పథకాలు లబ్ధిదారులకు కేటాయింపు విషయంలో ఇతని పాత్ర కీలకంగా ఉంటుంది. ఎలాగైనా  సహకరించాలని అప్పటి బాస్ కోరడంతో ఇతనే కాకుండా మండలంలో ఇతనికి దగ్గరగా ఉండే పలువురిని సైతం అప్పటి పెద్ద నాయకులకు కల్పించి రూ.లక్షల్లో డబ్బులు దండుకొని అసెంబ్లీ ఎన్నికల ముందు సమయంలో కాంగ్రెస్కు  ఓటు వేస్తే మీకు పెన్షన్, ఇండ్లు, దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలే గాక  కనీసం ఉపాధి హామీ పని కూడా ఉండదని, కులాల వారీగా మీకు వచ్చే కార్పొరేషన్ రుణాలు కూడా రావని విస్తృత ప్రచారం చేశాడనే విమర్శలు ఉన్నారు . ఇదే విషయంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిద్దరు ఈ అధికారి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సమాచారం. ప్రస్తుతo ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన పట్టించుకోని ఇతనిపై చర్యలు తీసుకోవాలని  స్థానిక గ్రామ ప్రజలు  కోరుతున్నారు.
వివరణ :
ఆరోపణలో నిజం లేదు..పంచాయతీ కార్యదర్శి బక్కయ్య..
నాపైన కావాలనే ఆరోపణలు చేస్తున్నారు… గ్రామంలోని ప్రజలను నాగురించి అడిగితె వారే చెప్పుతారు..నేను డ్యూటీ ఎంత బాధ్యతగా చేస్తానో చెప్పుతారు.
Spread the love