– తలసరి ఆదాయమూ పెరగాలి
– ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్
హైదరాబాద్ : ప్రపంచంలోనే భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ప్రశంసనీయమే.. కానీ ప్రస్తుత స్థాయిల నుండి దేశ ప్రజల తలసరి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ మాజీ గవర్నర్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ ఛైర్మన్ సి రంగరాజన్ అన్నారు. శనివారం ఇక్ఫాయి 13వ స్నాతకోత్సవం సందర్బంగా రంగరాజన్ మాట్లాడుతూ.. కరోనా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత భవిష్యత్తు అభివృద్థికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించుకోవడం ద్వారానే వృద్థి రేటును పెంచుకోగలమన్నారు. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం అద్బుతమైన విజయమన్నారు. కానీ.. మరోవైపు తలసరి ఆదాయం కథ వేరుగా ఉందని రంగరాజన్ అన్నారు. 2020లో తలసరి ఆదాయానికి సంబంధించి భారత ర్యాంక్ 197 దేశాలలో 142వ స్థానంలో ఉందన్నారు. ఇది మనం ప్రయాణించాల్సిన దూరాన్ని చూపుతుందన్నారు. ఇప్పుడున్న తలసరి ఆదాయ స్థాయిని బట్టి చూస్తే వేగంగా వృద్థి చెందడం తప్పా మనకు వేరే మార్గం లేదన్నారు. దేశం రాబోయే రెండు దశాబ్దాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో నిరంతరం ఏడు శాతం వృద్థి రేటును నమోదు చేయడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పును సాధించగలమన్నారు. అప్పుడే భారత్ అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థ స్థితికి చేరొచ్చన్నారు. ఇందుకోసం నూతన సాంకేతికతలను గ్రహించడంతో పాటుగా నైపుణ్యం కలిగిన మానవశక్తి అవసరం ఉంది. వృద్థితో పాటు ఉపాధి పెరగాలన్నారు. అదే విధంగా వృద్థి లేకుంటే ఉపాధి పెంపుదల నిలకడగా ఉండదన్నారు.