కనబడుట లేదు

– ప్రధానికి వ్యతిరేకంగా మణిపూర్‌లో పోస్టర్లు
– ఆయన మౌనంపై నిరసనకారుల ఆగ్రహం
– ఇంఫాల్‌లో హింసాత్మక వాతావరణం
– అనేక ఇండ్లకు నిప్పు పెట్టిన అల్లరి మూక
”మణిపూర్‌ అగ్నిగుండమై మండుతోంది. ప్రధాని మోడీ ఎక్కడీ” అంటూ వెలసిన పోస్టర్లు ఆ రాష్ట్ర ప్రజల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధిపథంలో దూసుకెళ్తుందన్నది బీజేపీ నినాదం! కానీ వాస్తవం వేరుగా ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నా మణిపూర్‌ అభివృద్ధికి నోచుకోకపోగా నేడు మంటల్లో మాడిపోతోంది… బీజేపీ రేపిన మతచిచ్చు చల్లారటంలేదు… ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, వారి ఆస్తులు ధ్వంసం అవుతున్నా ప్రధాని స్పందించడంలేదు. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్న చందంగా ఉన్న ప్రధాని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రహౌంమంత్రి అమిత్‌షా ఆ రాష్ట్రంలో పర్యటించినా పరిష్కారం లభించింది లేదు. ఇంకెంత మంది అమాయకులు బలికావాలంటూ స్థానిక ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. వాటి ఫలితమే ”మణిపూర్‌ మంటల్లో కాలిపోతుంటే ప్రధాని మోడీ కనబడటం లేదటూ వెలసిన ఈ పోస్టర్లు. బీజేపీ విద్వేషరాజకీయాలను, వాటిపట్ల మణిపూర్‌ ప్రజల నిరసనను ప్రతిబింబిస్తున్న ఈ పోస్టర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై మోడీ మౌనం అక్కడి ప్రజలు, ఆందోళనకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. రాష్ట్రంలో ఇంత జరిగినా ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోవటం వారి కోపానికి కారణమవుతున్నది. ఇందులో భాగంగా మోడీ కనబడటం లేదంటూ ఆందోళనకారులు మణిపూర్‌లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఈయనను(మోడీ) మీరు చూశారా?’ అని మోడీ పేరు ఆయన చిత్రంతో ఉన్న పోస్టర్లు రాష్ట్రంలో దర్శనమిస్తున్నాయి. ఆయన ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలనీ, ఛాతి 56 ఇంచులు అని ఆ పోస్టర్లలో రాసి ఉన్నది. అంధుడు, చెవిటి వాడనీ, ఆయనను చివరిసారి మణిపూర్‌ ఎన్నికల ర్యాలీలో చూశా మని అందులో పేర్కొన్నారు. మణిపూర్‌ విషయంలో మోడీ ఇప్పటికీ మౌనంగానే ఎందుకున్నారని కుకీ, మెయిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు, స్కాలర్లు ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ సైతం మోడీ తీరును తప్పుబడుతున్నది. ప్రధాని తన మౌనాన్ని వీడాలనీ, రాష్ట్రంలో శాంతికి పిలుపునివ్వాలని సూచించింది. సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘా ల నాయకులు సైతం మోడీ మౌనాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రధాని మౌనానికి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అల్లర్ల వేడి ఏ మాత్రం చల్లారటం లేదు. అక్కడ అవే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి కాంగ్పోక్పి జిల్లాలో కాల్పులు చోటు చేసుకోవటం, ఇండ్లకు నిప్పు పెట్టటం వంటి ఘటనలతో తొమ్మిది మంది తమ ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఒక రోజు గడవక ముందే ఇంఫాల్‌లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెల కొన్నాయి. ఆందోళన కారులు అనేక ఇండ్లకు నిప్పు పెట్టటం తో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. అయితే, అల్లరి మూకను చెదరగొట్టటానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ షెల్‌లను ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతుండ టంతో కేంద్ర బలగాలైన ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ రంగం లోకి దిగాయి. అయినప్పటికీ రాష్ట్రంలో హింస తగ్గు ముఖం పట్టకపోవటం గమనార్హం. దాదాపు నెల క్రితం మొదలైన అలర్లు ఇప్పటికీ కొనసాగుతుండ టంతో మణిపూర్‌లోనీ బీజేపీ సర్కారు వైఫల్యాన్ని సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రం గా విమర్శిస్తున్నారు. ఇటు కేంద్రంలోని మోడీ సర్కా రు సైతం అల్లర్లను కట్టడి చేయటంలో విఫలమైం దని ఆరోపించారు. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి రంగంలోకి దిగి రాష్ట్రంలో పర్యటించినా పరిస్థితులు అదుపులోకి రాకపోవటం మోడీ సర్కారు అచేతన స్థితికి నిదర్శనమన్నారు. కాగా మణిపూర్‌ అంశం అమిత్‌ షాకు తీవ్ర తల నొప్పిగా పరిణమించిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్‌పై మెయిటీ, కుకీ వర్గాల మధ్య వివాదం చెలరేగి అది ప్రస్తుత హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన విషయం విదితమే. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు అధికార బీజేపీకి ఊపిరి ఆడనివ్వటం లేదు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన నాయకులకు ఆందోళనకారుల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. బుధవారం చోటు చేసుకున్న హింసలో ఇంఫాల్‌లోని ఆ రాష్ట్ర మంత్రి నెమ్చా కిప్గెన్‌ అధికార నివాసానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. భద్రతా బలగాల నుంచి తస్కరించిన ఆయుధాలను తిరిగి ఇచ్చేయాలంటూ మరొక మంత్రి లీషన్‌గ్తెమ్‌ సుసిండ్రో మెయిటీ తన ఇంటి బయట ఒక డ్రాప్‌ బాక్స్‌ను ఉంచారు.

Spread the love