నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం బాగా ఊపందుకుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత మూలాలున్న కమలా హారిస్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటను ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. ‘నాటునాటు’ పాట స్ఫూర్తితో హిందీలో ‘నాచో నాచో’ గీతాన్ని రూపొందించారు. ఈ పాటను భారత-అమెరికన్ నాయకుడు అజయ్ భుటోరియా విడుదల చేశారు. ఈ సందర్భంగా అజయ్ భుటోరియా మాట్లాడుతూ… ‘నాచో నాచో’ కేవలం పాట మాత్రమే కాదని… ఇదొక ఉద్యమమని చెప్పారు. దక్షిణాసియా అమెరికన్ కమ్యూనిటీతో అనుసంధానం కావడమే తమ ప్రచార లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి 4.4 మిలియన్ల ఇండియన్ అమెరికన్ ఓటర్లు, 6 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు అర్హత కలిగి ఉన్నారని… కమలా హారిస్ కు మద్దతుగా వీరిని కూడగట్టడమే తమ లక్ష్యమని అన్నారు.