– ఏడాదిలో నలుగురు విద్యార్థులు బలవన్మరణం
– నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి
– యూనివర్సిటీలో వరుస వివాదాలతో అప్రతిష్ట
– సమస్యలపై స్పందించని యాజమాన్యం, ప్రభుత్వం
– గతేడాది వారం రోజులు ఆందోళన చేసిన విద్యార్థులు
– అమలుకాని విద్యాశాఖ మంత్రి హామీలు
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. తరచూ విషాద ఘటనలు జరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వరుస వివాదాలతో యూనివర్సిటీ అప్రతిష్టపాలవుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందడం తోటి విద్యార్థులు, తల్లిదండ్రులను కలిచివేస్తోంది. నాలుగు రోజుల కిందట దీపిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన బూర లిఖిత గురువారం హాస్టల్ భవనం నుంచి పడి మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది. ఏడాదిలో నలుగురు విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ యూనివర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20మంది వరకు మృతిచెందినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, సమస్యలపై గతేడాది విద్యార్థులు వారం రోజులు నిరవధికంగా ఆందోళన చేసిన విషయం విదితమే. చివరకు విద్యాశాఖ మంత్రి స్పందించి విద్యార్థులతో చర్చలు జరిపి.. డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఒక్కటీ అమలు చేయలేదు.
నవతెలంగాణ-బాసర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికంగా ఉన్న బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీ తరచూ వివాదాలతో వార్తల్లోకెక్కుతోంది. ముఖ్యంగా విద్యార్థుల వరుస మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులు వివిధ కారణాలతో మృతిచెందారు. రాథోడ్ సురేష్, భానుప్రసాద్ వ్యక్తిగత కారణాలు, ప్రేమ వ్యవహారాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలియగా.. యూనివర్సిటీ అధికారుల వేధింపులు కారణంగానే బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకొని దీపిక ఆత్మహత్య చేసుకుందని తండ్రి వీరన్న ఆరోపించారు. వార్షిక పరీక్షల సందర్భంగా దీపిక సెల్‌ఫోన్‌లో కాపీయింగ్ పాల్పడుతుండగా పట్టుబడినట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా, లిఖిత గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నాల్గో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి మృతిచెందినట్టు యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. విద్యార్థుల మరణాలు తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. యూనివర్సిటీ హాస్టళ్లలో వార్డెన్ల సరైన పర్యవేక్షణ లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలపై స్పందించని ప్రభుత్వం
విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం గత సంవత్సరం ఇదే నెలలో వారం రోజులపాటు ఆందోళన చేపట్టారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదని స్పష్టం చేశారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని తరగతులకు హాజరుకావాలని సూచించారు. ప్రధానంగా యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించాలని, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా అధ్యాపకుల భర్తీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, నూతనంగా మెస్‌లు ఏర్పాటు చేయాలని, యూనిఫామ్స్ అందజేయాలని, పీఈటీలను నియమించాలని కోరారు. ఈ డిమాండ్లలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కటీ నెరవేర్చలేదు. రెగ్యులర్ వీసీకి బదులు ఇన్‌చార్జి డైరెక్టర్‌ను నియమించి చేతులు దులుపుకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టర్ పదవీ కాలం కూడా మరికొన్ని రోజుల్లో ముగియనుందని తెలుస్తోంది. మిగతా డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూనివర్సిటీలో పర్యటించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. త్వరలోనే మెస్‌లను మారుస్తామని హామీ ఇచ్చినా అది కూడా నెరవేరకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.