అలహాబాద్‌ హైకోర్టు జడ్జిపై అభిశంసనకు నోటీసు

Allahabad High Court judge– రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు  ప్రతిపక్ష ఎంపీల అందజేత
– వీహెచ్‌పీ కార్యక్రమంలో విద్వేష ప్రసంగం చేసినందుకు..
న్యూఢిల్లీ : వీహెచ్‌పీ కార్యక్రమంలో విద్వేష ప్రసంగం చేసిన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి శేఖర్‌ కుమార్‌ యాదవ్‌ అభిశంసన కోరుతూ రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం నోటీసు అందచేశారు. రాజ్యసభకు చెందిన ఆరుగురు సభ్యుల బృందం ఈ నోటీసు అందచేసింది. మత సామరస్యానికి భంగం కలిగించేవిధంగా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌ విద్వేష పూరిత ప్రసంగం చేశారని నోటీసులో ఆరోపించారు. స్వతంత్ర ఎంపీ కపిల్‌ సిబాల్‌ నేతృత్వంలోని ఈ బృందంలో కాంగ్రెస్‌కు చెందిన వివేక్‌ తంఖా, దిగ్విజరు సింగ్‌, సీపీఐ(ఎం)కు చెందిన జాన్‌ బ్రిట్టాస్‌, ఆర్‌జెడికు చెందిన మనోజ్‌ కె. ఝా, టీఎంసీకు చెందిన సాకేత్‌ గోఖలే ఉన్నారు. ఈ నోటీసుపై పార్టీలకు అతీతంగా 55 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు. 21 పేజీల ఈ నోటీసులో ప్రధానంగా జస్టిస్‌ శేఖర్‌పై మూడు ఆరోపణలు చేశారు. విద్వేష పూరిత ప్రసంగంతో రాజ్యంగాన్ని ఉల్లంఘించడం, మత సామరస్యాన్ని దెబ్బతీశారని, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని, వారిపై పక్షపాతం, వివక్ష ప్రదర్శించారని విమర్శించారు. అలాగే, జ్యూడిషియల్‌ లైఫ్‌ విలువల పునరుద్ధరణ 1997 చట్టంను ఉల్లంఘిస్తూ యూనిఫాం సివిల్‌ కోడ్‌కు సంబంధించిన రాజకీయ విషయాలపై బహిరంగంగా చర్చించడం లేదా బహిరంగంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం చేశారని నోటీసులో విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(4), 124(5), ఆర్టికల్‌ 217(1)(బి), ఆర్టికల్‌ 218 ప్రకారం ‘అణిచితవేత చర్యలకు పాల్పడే ఒక జడ్జిని పదవి నుంచి తొలగించవచ్చు’ అని నోటీసులో పేర్కొన్నారు. న్యాయ నైతికత, నిష్పాక్షికత, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించడం కోసం ఈ విధంగా చేయవచ్చునని తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51 ఎ(ఇ)లో పొందుపర్చిన సామరస్యాన్ని ప్రోత్సహించడం, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించకుండా ఉండటం అనే ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని నోటీసులో విమర్శించారు. కాబట్టి జస్టిస్‌ యాదవ్‌ను తొలిగించే ప్రక్రియను ప్రారంభించే ప్రతిపాదనను అంగీకరించాలని రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ను ఈ నోటీసులో కోరారు. అలాగే జస్టిస్‌ యాదవ్‌ ప్రసంగంపై దర్యాప్తు చేయడానికి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

Spread the love