బీజేపీతో పొత్తుపై పునరాలోచన : ఎన్‌పిపి

ఇంఫాల్‌: మణిపూర్‌లో హింస ఆగకపోతే బీజేపీతో పొత్తుపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్పీపీ) స్పష్టం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం యుమ్నం జోరుకుమార్‌ సింగ్‌ మీడియాతో ఈ విషయం తెలిపారు. మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలపై మూగ ప్రేక్షకులుగా ఉండలేమని అన్నారు. పరిస్థితి మెరుగుపడకపోతే బిజెపితో పొత్తును పున్ణపరిశీలించాల్సి వస్తుందని చెప్పారు. ఆర్టికల్‌ 355 మణిపూర్‌లో అమలులో ఉందన్నారు. కాబట్టి ప్రజలను రక్షించడం రాష్ట్రం, కేంద్రం కర్తవ్యమని తెలిపారు. అయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సరైన ప్రణాళిక చేయడం లేదని ఆరోపించారు. దీంతో మణిపూర్‌లో పరిస్థితి మరింత దిగజారుతున్నదని విమర్శించారు. మణిపూర్‌లో పరిస్థితి మెరుగుపడే దాఖలాలు కనిపించడం లేదని ఎన్‌పిపి ఉపాధ్యక్షుడు యుమ్నం జోరుకుమార్‌ సింగ్‌ తెలిపారు. కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ ఇంటిని కూడా తగులబెట్టడం దీనికి నిదర్శనమని చెప్పారు. బిజెపి మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పొత్తు ఉన్న ఎన్‌పిపిని కూడా ప్రజలు లక్ష్యంగా చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మణిపూర్‌ను సందర్శించినప్పటికీ రాష్ట్ర పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. మణిపూర్‌పై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం నియంత్రణ ఉందని జోరుకుమార్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది గందరగోళానికి దారి తీస్తున్నదని చెప్పారు. దీనిపై స్పష్టత రానిదే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మెరుగుపడవని అన్నారు. సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌కు తమ పార్టీ ఒక తీర్మానాన్ని సమర్పించినట్లు చెప్పారు. భద్రతా దళాలు ప్రజలను రెచ్చగొట్టకుండా చూడాలని అందులో పేర్కొన్నట్లు తెలిపారు. అన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత తటస్థంగా ఉండాలా లేక ప్రతిపక్షాలతో కలిసి వెళ్లాలా అన్నది నిర్ణయిస్తామన్నారు.

Spread the love