– సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
– పంజాబ్ ప్రభుత్వ అప్పీల్ కొట్టివేత
న్యూఢిల్లీ: కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద అడ్మిషన్లు అనేది పెద్ద మోసమని, దీన్ని వెంటనే ఆపాల్సి వుందని సుప్రీం కోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. పంజాబ్ రాష్ట్రంలో అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఎన్‌ఆర్‌ఐ కోటా నిర్వచనం పరిధిని విస్తరించాలని పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఆ అప్పీల్‌ను మంగళవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎన్‌ఆర్‌ఐల అంకుల్స్, ఆంటీలు, కజిన్లతో సహా దూరపు బంధువులందరినీ 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటా కిందకు చేరుస్తూ ఆగస్టు 20న ఆప్ ప్రభుత్వం తీసుకున్న చర్యను పంజాబ్, హర్యానా హైకోర్టు సెప్టెంబరు 10న కొట్టివేసింది. ‘ఇది డబ్బు సృష్టించే యంత్రం తప్ప మరొకటి కాదు.’ అని ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.
”అన్ని పిటిషన్లను కొట్టివేయాలి. ఈ ఎన్‌ఆర్‌ఐ బిజినెస్ అంతా మోసం తప్ప మరొకటి కాదు. దీనికి వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టాలి. ఇకపై చట్టానికి ప్రాధాన్యతనివ్వాలి.” అని బెంచ్ స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదని పేర్కొంది. మూడు రెట్లు ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్ధులకు వీరి వల్ల కాలేజీల్లో అడ్మిషన్లు దొరకవని పేర్కొంది. విదేశాల్లో స్థిరపడిన వారి బంధువులనే ఒకే ఒక కారణంతో మెరిట్ అభ్యర్ధులను పక్కకు తోసి వారికి ప్రవేశాలు కల్పించడాన్ని ఇక ఎంత మాత్రమూ అనుమతించరాదని చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ ఎన్‌ఆర్‌ఐ కోటా వ్యాపారాన్ని తక్షణమే నిలుపుచేయాలన్నారు.
పంజాబ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌న్యాయవాది షాదాన్ ఫరాసత్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా ఎన్‌ఆర్‌ఐ కోటా నిర్వచనానికి విస్తృత భాష్యం చెబుతున్నాయని అన్నారు. పైగా 15శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాను ఎలా మంజూరు చేయాలో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు వుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ సూచించింది.