ఎన్టీఏను రద్దు చేయాలి

– విద్యా సంస్థల బంద్‌ విజయవంతం
– కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పలు చోట్ల అరెస్టులు
– దేశ యువతను బీజేపీ మోసం చేస్తోంది : మయూఖ్‌ బిశ్వాస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో విద్యార్థుల పట్ల మోడీ సర్కార్‌ అవలంబిస్తోన్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్‌ విజయవంతమైంది. నీట్‌, నెట్‌ పరీక్షల్లో అవకతవకలు, పేపర్‌ లీక్‌కు కారణమైన ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ బంద్‌ జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఎస్‌ఎఫ్‌ఐతో ఇతర సంఘాలు కూడా కలిసి బంద్‌ నిర్వహించాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు శిథిలావస్థకు చేరుకున్నాయని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ దేశమంతటా విద్యార్థులు తమ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ రాష్ట్రాల్లో పలువురు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌ కారణంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే విద్యా సంస్థలు సెలవును ప్రకటించాయి. త్రిపురలోని అగర్తలలో రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని పోలీసులు 50 మందికిపైగా విద్యార్థులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ త్రిపుర రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సులేమాన్‌ అలీ, సద్నిపాన్‌ దేబ్‌, గిరిజన విద్యార్థి సంఘం (టిఎస్‌యు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నేతాజీ దేబ్‌ వర్మ, సుజిత్‌ త్రిపురలను అరెస్టు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ దేశంలో విద్యను మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి బంద్‌ను విజయవంతం చేశారు. కాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ప్రభుత్వ విద్యా విధానాలకు వ్యతిరేకంగా తమ అసమ్మతిని నమోదు చేసేందుకు విద్యార్థులు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు.
కేరళ రాష్ట్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర రాజ్‌భవన్‌కు భారీ మార్చ్‌ను నిర్వహించి బంద్‌ను నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి అనుశ్రీ, అర్షో, సీఈసీ సభ్యులు అఫ్సల్‌, విచిత్ర, సెరీనా, అంజు కృష్ణన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్త బంద్‌ పిలుపునకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ భారీ స్పందన లభించింది. ఈ రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనల్లో ఎస్‌ఎఫ్‌ఐతో పాటు ఏఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వో సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. అలాగే ఎస్‌ఎస్‌ఐ తమిళనాడు రాష్ట్ర కమిటీ బంద్‌ను విజయవంతంగా నిర్వహించింది. రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసన ర్యాలీ నిర్వహించింది.
పశ్చిమ బెంగాల్‌లోని అన్ని ప్రధాన విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులు బంద్‌ను విజయవంతం చేశారు. ముఖ్యంగా విద్యార్థుల మద్దతు, ఉత్సాహం కారణంగా బెంగాల్‌లోని చాలా పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు మూసివేయబడ్డాయి. జల్పాయిగురి జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వందలాది మంది విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు.

దేశ యువతను బీజేపీ మోసం చేస్తోంది : మయూఖ్‌ బిశ్వాస్‌
మోడీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, యువతను మోసం చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ హయాంలో పేపర్‌ లీకేజీలు, మోసం, అవినీతి నీట్‌, నెట్‌ సహా పలు పరీక్షల్లో అంతర్భాగాలుగా మారాయని విమర్శించారు. ఈ పోరాటం ఎస్‌ఎఫ్‌ఐ ఒక్క సంఘానిదే కాదని, అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, వైద్యులతో ఎస్‌ఎఫ్‌ఐ నిలుస్తుందని అన్నారు. ఫీజు పెంపు నుండి కోవిడ్‌ అనంతర సమస్యల వరకు విద్యార్థి ఉద్యమం ఐక్యతను ఈ దేశం చూసిందని తెలిపారు. అంతేకాక ఈ పోరాటం ఇతర ప్రజాస్వామిక, ప్రగతిశీల విద్యార్థి సంఘాలతో కొనసాగుతోందని స్పష్టం చేశారు. నీట్‌, నెట్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలని, పీహెచ్‌డీ అడ్మిషన్లల్లో నెట్‌ స్కోర్‌ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రవేశ పరీక్షల మాఫియాలను ప్రోత్సహించే జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షలతో అడ్మిషన్లు చేసే విధానాలను ఉపసంహరించుకోవాలన్నారు. టిస్‌ ముంబయి, ఐఐటి ముంబయి నుండి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ వరకు విద్యార్థి సంఘ నేతలపై దాడులను, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. అలాగే దేశంలోని పాఠశాలల మూసివేతను ఆపాలని డిమాండ్‌ చేశారు.

Spread the love