ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్..

నవతెలంగాణ-హైదరాబాద్: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. తన లాయర్లతో కలిసి ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రవీణ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా.. క్యాసినో కేసులో గతంలోనూ చికోటిని ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్‌లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ప్రవీణ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే థాయిలాండ్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరికిన తర్వాత మరోసారి ఈడీ నోటీసులిచ్చింది. థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహిస్తుండగా చికోటి ప్రవీణ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు లావాదేవీలపై చికోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించనుంది. చికోటి ప్రవీణ్‌తో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులిచ్చింది. ట్రావెల్ ఏజెంట్ సంపత్ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. పటాయలో దొరికిన తర్వాత ఈ కేసులో ఈరోజు విచారణకు రావాలని చికోటి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులిచ్చింది. ఆర్థిక లావాదేవీలతో పాటు నగదు బదిలీపై కూడా చికోటిని ఈడీ ప్రశ్నించనుంది.

Spread the love