ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అతికష్టంపై కారులోనుంచి తీసి దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులంతా నిజాంపేటకు చెందినవారిగా గుర్తించారు. నిజాంపేటకు చెందిన దివ్యకు వివాహం నిశ్చయం అయింది. దీంతో బ్యాచిలర్‌పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి టిఫిన్‌ చేయడానికి కారులో నార్సింగి సీబీఐటీ నుంచి ఖానాపూర్‌ వెళారు. తిరిగి వస్తుండగా అదుపుతప్పిన కారు.. పోచమ్మ దేవాలయం వద్ద నిలిచిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని బెలూన్లు ఓపెన్‌ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి. తీవ్రగాయాలపడంతో దివ్యతోపాటు మరో ఇద్దరు అక్కకడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love