– ఈ దీక్ష ఆరంభం మాత్రమే
– దేశ వ్యాప్త ఉద్యమాలు చేస్తాం : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత
– మహిళలకు భాగస్వామ్యం లేకపోతే సమాజం ముందుకుపోదు : ఏచూరి
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల కోసం ఈ నిరాహార దీక్ష ఆరంభం మాత్రమేననీ, ఇకపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. మహిళలకు రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలంటే 33శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీలో ఉన్న బీజేపీ సర్కార్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించి, చట్టంగా తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ బిల్లు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరాహార దీక్షకు వచ్చిన మహిళల సంతకాలను సేకరించామనీ, సంతకాలతో కూడిన లేఖను ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపిస్తామని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయం 10:30 లకు జాతీయగీతంతో ప్రారంభమైన ఈ దీక్ష, సాయంత్రం 4 గంటలకు ముగిసింది. కవిత దీక్షను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించగా, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, బీఆర్‌ఎస్‌ ఎంపీ కె. కేశవరావు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ‘ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశంలో సగం’ అనేదే తమ నినాదమని అన్నారు. రాజకీయ క్షేత్రంలోనూ మహిళలకు భాగస్వామ్యం కోసం 33 శాతం రిజర్వేషన్లు తీసుకురావల్సి ఉందన్నారు. 1996 అప్పటి ప్రధాని దేవెగౌడ హయాంలో మహిళా బిల్లు పెట్టినా, అది చట్టం రూపం దాల్చలేదన్నారు. ఆ తరువాత మహిళా బిల్లు ఆమోదం కోసం అనేక పార్టీల మహిళా నేతలు ప్రయత్నాలు చేశారన్నారు. అందులో బృందాకరత్‌, సోనియా గాంధీ, జయంతి నటరాజన్‌, సుష్మా స్వరాజ్‌ ఇతర మహిళా నేతలు ఉన్నారనీ, వారు చేసిన పోరాటానికి సెల్యూట్‌ చేస్తున్నట్టు చెప్పారు. నాడు వారు చేసిన ప్రయత్నమే, నేడు మహిళా రిజర్వేషన్ల బిల్లు పోరాట పరంపరగా కొనసాగుతుందన్నారు.
మహిళా రిజర్వేషన్ల అంశం ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదనీ, ఇది దేశానికి సంబంధించిన అంశమని కవిత స్పష్టం చేశారు. మహిళల భాగస్వామ్యం లేకపోతే, దేశం ఎలా ముందుకు వెళుతుందని ప్రశ్నించారు. 1992లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించారనీ, ఫలితంగా ప్రస్తుతం 21 రాష్ట్రా ల్లో స్థానిక సంస్థల్లో 50 శాతానికిపైగా మహిళా ప్రాతినిధ్యం ఉందని వివరించారు.
కాబట్టి ఇప్పుడు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పి స్తే 10-20 ఏండ్ల తర్వాత పార్ల మెంట్‌, రాష్ట్రా ల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 50 శాతా నికిపైగా పెరుగుతుందని అన్నారు. సోమ వారం నుంచి ప్రారంభం కాను న్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టాలనీ, కేంద్రం పై ఒత్తిడి చేయాలని అన్నారు.
మహిళ బిల్లు అవసరం ఎంతో ఉంది :సీతారాం ఏచూరి
రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లు అవసరం ఎంతైనా ఉందనీ, మహిళలకు భాగస్వామ్యం లేనంతవరకూ సమాజం ముందుకు పోదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నొక్కి చెప్పారు. దీక్షను ప్రారంభిస్తూ సీతారాం ఏచూరి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల పోరాటం ఉంటుందని అన్నారు. ఎన్నో అడ్డంకుల తరువాత మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందనీ, కానీ లోక్‌సభ ఆమోదముద్ర వేయలేదని అన్నారు. సోమవారం నుంచి జరిగే రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుబడతామని చెప్పారు. ’30 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెండింగ్‌లో ఉంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళ లకు సరియైన ప్రాతినిధ్యం లభించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకోసం మహిళా బిల్లు తప్పనిసరి అవసరం’ అని పేర్కొన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మోడీ కూడా మద్దతు తెలిపారని గుర్తు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ప్రధాని ఈ బిల్లు తెస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆయన ప్రధానమంత్రి అయి తొమ్మిదేండ్లు పూర్తయినా ఇప్పటివరకు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్ట లేదని విమర్శించారు. కవితకు ఈ విషయము లో అన్ని విధాలుగా మద్దతు ఇస్తామన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 14 శాతం, రాజ్య సభలో 11 శాతం మాత్రమే మహిళా సభ్యులు ఉన్నారన్నారు.
అనేక మంది మహిళల ఆక్రందన : సంజరు సింగ్‌
మహిళా బిల్లు అనేది సుదీర్ఘ కాలంగా అనేక మంది మహిళల ఆక్రందన అని ఆప్‌ రాజ్యసభ సభ్యులు సంజరు సింగ్‌ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు మహిళా బిల్లు ఎందుకు ఆమోదం పొందడం లేదో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ వాగ్దానం చేసి తొమ్మిదేండ్లు అయిందని, ఇప్పుడు ఆ పార్టీ దీనిపై స్పందిం చడం లేదని విమర్శించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇస్తుందని, ఈ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరాహారదీక్షలో దేశంలోని పలు రాజకీయ పార్టీలు, 29 రాష్ట్రాలకు చెందిన మహిళ హక్కుల పోరాట సంఘాలు, ఎన్జీఓలు, జేఎన్‌యూ, జామియా విద్యార్థులు, మహిళా ప్రతినిధులు మద్దతు తెలిపారు. సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం)), కె.నారాయణ (సీపీఐ), సంజరు సింగ్‌, చిత్ర సర్వారా (ఆప్‌), నరేష్‌ గుజ్రాల్‌ (శిరోమణి అకాళీదళ్‌), పూజా శుక్లా (ఎస్పి), సీమా మాలిక్‌ (ఎన్సిపి), శ్యామ్‌ రజాక్‌ (ఆర్‌ఎల్డి), షమీమ్‌ ఫిర్దౌస్‌ (నేషనల్‌ కాన్ఫరెన్స్‌) మద్దతు పలికారు. ఆర్జేడీ, పీడీపీ, శివసేన నేతలు సంఘీభావం తెలిపారు. మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వర్‌ రావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యేలు రేఖా శ్యాంనాయక్‌, పద్మా దేవేందర్‌ రెడ్డి, మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్‌ పర్సన్‌ ఆకుల లలితలతో పాటు పలువురు జెడ్పీచైర్మన్లు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షలో కూర్చున్నారు.
వంటనే కాదు… దేశాన్ని పాలించగలం
మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కవిత చేస్తోన్న దీక్ష అభినందనీయమని రాష్ట్ర మహిళా మంత్రులు అన్నారు. మహిళ లేనిదే ప్రపంచం లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ, అధికారంలోకి రాగానే ఈ బిల్లును మరుగున పెట్టడం సరికాదన్నారు. బీజేపీ కళ్ళు తెరిచి బిల్లు పాస్‌ చేయాలన్నారు. మోడీని ప్రశ్నిస్తున్న పార్టీలు, రాజకీయ పార్టీల నేతల పై దర్యాప్తు సంస్థలను ఉసికొల్పుతున్నారని ఆరోపించారు. మహిళలకోసం కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వల్ల దేశం మొత్తం కేసీఆర్‌ వైపు, తెలంగాణ వైపు చూస్తుందన్నారు. వంట చేయడం కాదు… దేశాన్ని పాలించడం మహిళలకు తెలుసునని ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. భారత మాతా అంటే అందులోనూ అమ్మ ఉందనీ, ఆ అమ్మను మరవద్దని కోరారు.

Spread the love