శ‌వాల దిబ్బ‌

– మరుభూమిని తలపించిన బహనగబజార్‌ స్టేషన్‌
– ప్రయివేటు
నిర్వహణ వల్లే ఈ ఘోర విషాదం
– 288 మంది మృతి : రైల్వేశాఖ
– మరో 900 మందికి గాయాలు

– బాధితులకు ప్రధాని మోడీ, సీఎంలు నవీన్‌, మమతా బెనర్జీ పరామర్శ
– కారుచీకట్లలో వెల్లువెత్తిన మానవతాసాయం
– క్షతగాత్రుల కోసం వేలాది మంది రక్తదానం
    చెల్లాచెదురుగా పడిన బోగీలు.. రక్తం తడారని రైళ్ల శకలాలు.. పట్టాల మధ్యనే తరలించేందుకు సిద్ధం చేసిన మృతదేహాలు.. తమవారి కోసం రెప్పవాల్చకుండా వెతుకుతున్న అభాగ్యులు.. సాయం కోసం స్థానికులు ముందుకొచ్చారు. అంతులేని దు:ఖంతో ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించింది. ఈ ఘోర రైలు ప్రమాద ఘటన జరిగి 24 గంటలు గడిచినా.. ప్రమాదస్థలిలో విషాదఛాయలు తొలగిపోలేదు. శని వారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనూ ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలోని బహనగబజార్‌ స్టేషన్‌ వద్ద కనిపించిన భీతావహదృశ్యాలివి.
న్యూఢిల్లీ : సిగలింగ్‌ వ్యవస్థ వైఫల్యంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్‌ను ఢకొీనడం.. ఆ బోగీలు మరో మెయిన్‌ ట్రాక్‌లోకి ఒరిగిపోవడం.. ఆ తర్వాత వాటిని యశ్వంత్‌పూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఢకొీనడం వెంటవెంటనే జరిగాయి. శకలాలు ఇంకా పూర్తిగా తొలగించనందున.. ఒడిశా ఘోరకలిలో ఇప్పటి వరకు 288 మంది మరణించారనీ, మరో 900 మంది గాయపడ్డారని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది.
ప్రమాదస్థలిని, ఆ తర్వాత క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులను ప్రధాని మోడీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లిన ఉన్నతస్థాయి బృందాలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వేశాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం ఆయన ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైనవారు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
‘గొప్పలు మానుకొని ఆధునీకరణ చర్యలు చేపట్టండి’
కేంద్రం రైల్వేశాఖ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణే ఈ ప్రమాదానికి కారణమని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు విమర్శించారు. వందేభారత్‌, బుల్లెట్‌ రైళ్ల మోజులో పడి సాధారణ ప్రజలు ప్రయాణించే సర్వీసుల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేల్లో ఖాళీలను భర్తీ చేయకపో వడంతో ఉన్న సిబ్బందితో పని భారం పెరిగిపోవడం, నిధుల కొరతతో సిగలింగ్‌ వంటి సాంకేతిక వ్యవస్థలు ఆధునీకరణకు నోచుకోక అఘోరిస్తు న్నాయని వాపోయారు. ఒడిశా ఘోర ప్రమాదాలకు బాధ్యత వహించి రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణోవ్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలన్నారు. ఇప్పటికైనా గొప్పలు మానుకొని క్షేత్రస్థాయిలో రైల్వేల ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.
ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైల్వే ప్రమాదంలో మృతుల సంఖ్య 288కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య 900కి చేరిందని సౌత్‌ ఈస్ట్‌ రైల్వే ప్రతినిధి ఆదిత్య చౌదరి శనివారం తెలిపారు. గాయపడిన వారందరినీ కాపాడి, ఆస్పత్రుల్లో చేర్చడం కూడా పూర్తయిందని చెప్పారు. మొత్తంగా సహాయక చర్యలు పూర్తయ్యాయని రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం బాలాసోర్‌లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సహాయక, పునరుద్ధరణ చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపారు. వాయు సేనకు చెందిన విమానాలను కూడా మోహరించారు. అయితే ప్రమాద తీవ్రతను దృష్టిలో వుంచుకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు వున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఒకదానిపైకి మరొక బోగీ ఎక్కడం, బోగీలు వంకర్లు తిరిగిపోవడంతో లోపల ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి, మృతదేహాలను వెలికి తీయడానికి పెద్ద పెద్ద క్రేన్లు, బుల్డోజర్లను ప్రమాద స్థలానికి రప్పించాల్సి వచ్చింది.
మనసును కలిచివేసింది : నవీన్‌ పట్నాయక్‌
బాలాసోర్‌లోని జిల్లా హెడ్‌క్వార్టర్‌ ఆస్పత్రిని సందర్శిం చిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బాధితులను పరా మర్శించారు. డాక్టర్లతో మాట్లాడి వారికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాటా ్లడుతూ.. ఈ విషాద ఘటన తన మనస్సునెంతో కలిచి వేసిందని అన్నారు. సకాలంలో స్థానికులు స్పందించిన తీరును ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్పాలని తెలిపారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించారు.
ఉన్నత స్థాయి దర్యాప్తు : అశ్విని వైష్ణవ్‌
ఒడిశా దుర్ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తును రైల్వే చేపడుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ శనివారం ప్రకటించారు. సౌత్‌ ఈస్ట్రన్‌ సర్కిల్‌ రైల్వే భద్రతా కమిషనర్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగుతుందని అధికారులు శనివారం తెలిపారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో రైల్వే భద్రతా కమిషనర్‌ కార్యాలయం పని చేస్తుంది. ఇటువంటి ప్రమాదాలపై దర్యాప్తు జరుపుతుంది.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి : ప్రతిపక్షాల డిమాండ్‌
భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో నాల్గవదిగా భావిస్తున్న ఈ ఘోర ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు శనివారం డిమాండ్‌ చేశాయి. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నాయి. జరిగిన ఘోరంపై కాంగ్రెస్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. రైల్వే నిర్వహణలో ప్రయాణికుల భద్రతకే పెద్ద పీట వేయాల్సి వుందని పేర్కొంది. సీపీఎం(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపంకర్‌ భట్టాచార్య ట్వీట్‌ చేస్తూ, ”భారతీయ రైల్వేలో మనకు సిగలింగ్‌, భద్రతా వ్యవస్థలు లేవా? లేదా ఇటువంటి మహా విషాదాలు ఇకపై దేశంలో రైల్వే ప్రయాణాల్లో సాధారణం కానున్నాయా? బాధితులకు, వారి కుటుంబాలకు మనం సమాధానం చెప్పాల్సి వుంది.” అని పేర్కొన్నారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలని సీపీఐ, ఆర్జేడీలు డిమాండ్‌ చేశాయి. సవివరమైన రీతిలో దర్యాప్తు జరగాల్సి ఉన్నదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కె.పళనిసామి వివరించారు. ప్రమాద స్థలిని సందర్శించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడుతూ ఈ ఘోర ప్రమాదం వెనుక ఏదో తప్పు జరిగిందనీ, దానిపై సక్రమంగా దర్యాప్తు జరగాలని కోరారు. ప్రమాదానికి గురైన బోగీల్లో మూడింటిని సోదా చేయలేదని విమర్శించారు.
యుద్ధ భూమిని తలపిస్తున్న బాలాసోర్‌ జిల్లా ఆస్పత్రి
తెల్లవారు జామున 2గంటల సమయం…బహనగ రైల్వే స్టేషన్‌ మార్చురీని తలపిస్తోంది. బోగీల నుంచి వెలికి తీసిన మృతదేహాలు అక్కడ గుట్టలుగా పడివున్నాయి. వాటిని ట్రక్కుల్లో తీసుకుని ఆ సమీపంలోని హైస్కూల్‌ ఆవరణలో ఉంచారు. నేలపై నిర్జీవంగా పడి వున్న ఆ శవాల జేబుల్లోని మొబైల్స్‌ నిరంతరంగా మోగుతునే వున్నాయి. తమవారి ఆచూకీ తెలుసుకునేందుకు ఆతృతగా వారు చేస్తున్న ఫోన్లతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. వరుసగా వస్తున్న బాధితుల ఆక్రందనలతో బాలాసోర్‌ జిల్లా ఆస్పత్రి, సోరో హాస్పిటల్‌లు కదన రంగాన్ని తలపించాయి. స్ట్రెచర్లపై, బయట కారిడార్లలో, గదుల్లో ఎక్కడ చూసినా క్షతగాత్రులే కనిపిస్తున్నారు. వారికి అవసరమైన చికిత్సలం దిస్తూ డాక్టర్లు, నర్సులు అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు.
33 రైళ్ళ రద్దు
శుక్రవారం ఒడిశా ప్రమాదంతో మొత్తంగా 33 రైళ్ళను పూర్తిగా రద్దు చేసినట్టు నైరుతి రైల్వే శనివారం ప్రకటించింది. కాగా మరికొన్ని రైళ్ళను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్ళించారు. ప్రమాద స్థలిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకెళ్ళిన రెండు రైళ్ళు శనివారం హౌరా చేరుకున్నాయి.
కవచ్‌ ఆ రూట్‌లో లేదు
ప్రమాదం జరిగిన మార్గంలో యాంటీ ట్రెయిన్‌ కొలిజన్‌ సిస్టమ్‌ ‘కవచ్‌’ అందుబాటులో లేదని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. రైల్వే నెట్‌వర్క్‌ వ్యాప్తంగా కవచ్‌ను నెలకొల్పడానికి అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు. లోకో పైలట్‌ సిగల్‌ను విస్మరించినపుడు కవచ్‌ వ్యవస్థ పైలట్‌ను అప్రమత్తం చేస్తుంది, బ్రేక్‌లను పూర్తిగా అదుపులోకి తీసుకుని రైలు కదలికలను నిలిపివేస్తుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేలో 14.93 శాంక్షన్డ్‌ పోస్టులలో 3.14 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1.35 లక్షల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. దీంతో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఇటు రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్టవేయటంతో పాటు అటు నిరుద్యోగుల బాధలను తొలగించాలని సామాజికవేత్తలు, పౌర సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.
ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానుల సంతాపం
ఒడిశా రైలు ప్రమాదం పట్ల పలువురు ప్రపంచంలోని పలు దేశాధినేతలతో సహా ప్రధానులు స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటీష్‌ ప్రధాని రిషి సునక్‌, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, నేపాల్‌ ప్రధాని ప్రచండ, పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ మేరకు సంతాప సందేశాలు పంపించారు. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షులు కసాబా కోరొసి కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోడీకి సంతాపాన్ని తెలియచేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో భారత్‌కు అండగా ఉంటామని వారు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీకి టెలిగ్రామ్‌ ద్వారా సంతాపం తెలిపారు.
దయచేసి ఒడిశాలో రైలు ఢకొీన్న విషాద సంఘటనపై మా ప్రగాఢ సానుభూతిని అంగీకరించండి. ఈ విపత్తులో వారి బంధువులు, సన్నిహితులను కోల్పోయిన వారి బాధను మేము పంచుకుంటున్నాము. గాయపడిన ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
– పుతిన్‌, రష్యా అధ్యక్షులు
ప్రాణాలతో బయటపడిన వారికి, రెస్క్యూ ఆపరేషన్‌లలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారికి తన హృదయపూర్వక మద్దతు తెలుపుతున్నాను. ఒడిశాలో జరిగిన విషాద సంఘటనల వల్ల ప్రభావితమైన వారందరికీ, మరణించిన వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
– రిషి సునక్‌, బ్రిటన్‌ ప్రధాని
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో అనేకమంది విలువైన ప్రాణాలను కోల్పోవడం.. గాయపడిన వార్తలకు నేను చాలా బాధపడ్డాను. జపాన్‌ ప్రభుత్వం, ప్రజల తరపున, వారికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
– కిషిడా, జపాన్‌ ప్రధాని
క్లిష్ట సమయంలో కెనడియన్లు భారత ప్రజలకు అండగా నిలుస్తున్నాం. భారత్‌లోని ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద చిత్రాలు, నివేదికలు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– ట్రూడో, కెనడా ప్రధాని
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడం నాకు బాధ కలిగించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ, ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ఈ ద్ణుఖ సమయంలో.. వారికి నా సానూభూతి తెలుపుతున్నాను.
– ప్రచండ, నేపాల్‌ ప్రధాని
రైలు ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. భారత్‌లో జరిగిన రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.
– షెహబాజ్‌ షరీఫ్‌, పాక్‌ ప్రధాని
సమగ్రంగా దర్యాప్తు చేయాలి
రైలు ప్రమాద మృతులకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం
ఇటీవల కాలంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన అత్యంత ఘోర మైన రైలు ప్రమాదంలో మరణిం చిన వారి కుటుంబాలకు సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సంతా పం తెలియచేసింది. గాయపడిన వారికి సత్వరమే వైద్య సహాయం అందేలా చూడడం ద్వారా మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని సంబంధిత అధికారులను పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో కోరింది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో బహనాగా రైల్వే స్టేషన్‌కు సమీపంలో మూడు రైళ్ళు ఢ కొన్న ప్రమాదానికి దారి తీసిన కారణాలను కూలంకషమైన దర్యాప్తు ద్వారా నిర్ధారించాల్సి వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. రైల్వే భద్రతకు సంబంధించిన అంశాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మోడీ ప్రభుత్వం చేపట్టే ఆధునీకరణ ప్రణాళికల్లో దీన్ని ఎంత మాత్రమూ విస్మరించరాదని పొలిట్‌బ్యూరో పేర్కొంది..

సిగ్న‌ల్‌ ఇచ్చారు కానీ…
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కి సిగల్‌ ఇచ్చారనీ, కానీ వెంటనే వెనక్కి తీసుకున్నారనీ, ఈలోగా కోరమాండల్‌ లూప్‌లైన్‌లోకి ప్రవేశించి అక్కడ ఆగి వున్న గూడ్స్‌ రైలును ఢ కొందని రైల్వే అధికారుల బృందం ప్రాధమిక దర్యాప్తులో తేలింది. సిగల్‌ ఇచ్చి ఎందుకు వెనక్కి తీసుకున్నారన్న కారణాన్ని ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. ఇదిలా వుండగా, సీనియర్‌ డిప్యూటీ కమర్షియల్‌ మేనేజర్‌, సౌత్‌ ఈస్ట్‌ రైల్వేస్‌ ప్రతినిధి రాజేష్‌ కుమార్‌ ప్రమాదం జరిగిన తీరును హిందూతో వివరిస్తూ, ”లూప్‌ లైన్‌లో గూడ్స్‌ రైలు ఆగి వుంది. గంటకు 130కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమండల్‌ లూప్‌లైన్‌లోకి వెళ్ళి అక్కడ నిలిచిన గూడ్స్‌ను వెనక నుంచి ఢ కొట్టింది. మెయిన్‌ లైన్‌లో వెళ్ళేందుకు కోరమండల్‌కు సిగల్‌ అప్పటికే ఇచ్చారు. అయినా కోరమండల్‌ తన దిశ మార్చుకుని ఎందుకు లూప్‌లైన్‌లోకి వెళ్ళిందో తెలియడం లేదు.” అని చెప్పారు. కోరమండల్‌ ఇంజన్‌ మొత్తంగా గూడ్స్‌ రైలును పైకెత్తేసింది. దీంతో కోరమండల్‌కి చెందిన 12బోగీలు పట్టాలు తప్పాయి, అదే సమయంలో ఎదురుగా వస్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్పటికే ప్రమాద స్థలిని దాటింది కానీ దాని చివరి రెండు జనరల్‌ బోగీలను కోరమాండల్‌ చివరి బోగీలు ఢ కొన్నాయి. దీంతో ఆ జనరల్‌ బోగీలు దెబ్బతిన్నాయన్నారు.

ప్రధాని మోడీ పరామర్శ
ప్రధాని ప్రమాద స్థలిని శనివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక సిబ్బంది, రైల్వే అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఈ మహా విషాద సమయంలో యావత్‌ ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ నుంచే క్యాబినెట్‌ సెక్రెటరీ, ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సాయం అందేలా చూడాల్సిందిగా ఆదేశించారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ, దోషులెవరైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు.
సిబ్బంది కొరత.. లక్షల్లో ఖాళీలు
లోకోపైలెట్లపై తీవ్ర పని ఒత్తిడి

దేశంలో వందేభారత్‌ రైళ్లు, అమృత్‌ భారత్‌ స్టేషన్‌లు అంటూ ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. భారత రైల్వేలో అపూర్వ మార్పులు తీసుకొస్తున్నామంటూ ఇటు రైల్వే శాఖ సామాజిక మాధ్యమాల్లో ఊదరగొడుతున్నది. ఒడిశాలోని రైలు ప్రమాదం మాత్రం భారత రైల్వే శాఖకు ఒక హెచ్చరికను పంపింది. ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నది. లక్షలాది సంఖ్యలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అయితే అవి భర్తీకి నోచుకోకపోవడం, అది సిబ్బంది కొరతకు దారి తీయడంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్ర పని భారం పడుతున్నది. దీంతో నిర్ణీత పని గంటలకు మించి డ్యూటీ చేయాల్సి రావటం, విశ్రాంతి లేకపోవటం, నిద్ర లేమి, బిజీ షెడ్యూల్‌.. వంటి కారణాలు ఒడిశా వంటి భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.ముఖ్యంగా, రైల్వేలో లోకోపైలెట్ల పాత్ర చాలా కీలకమనీ, వారు 12 గంటలకు మించి పని చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని కొందరు ఉద్యోగులు తెలిపారు.

Spread the love