తెలంగాణ మాండలికాన్ని ప్రపంచానికి చాటిన దాశరధి కవులు..

– జిల్లా కలెక్టర్ శశాంక్
నవతెలంగాణ – చిన్నగూడూరు
తెలంగాణ వాదాన్ని, భాషను, మాండలికాన్ని రచనలను ప్రపంచానికి తెలియపరిచిన మహాకవులు దాశరధి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు అని జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో దాశరధి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో సాహితి దినోత్సవం సందర్భంగా దాశరధి సోదరులకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఆనాడు తెలంగాణ వాదాన్ని తన సాహిత్యాలతో సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చారని అన్నారు. దాశరధి సోదరులు పుట్టిన గడ్డ పోరాటాలకు పురుడు పోసిన గడ్డ అని అన్నారు. నూతనంగా కవులు, కళాకారులను ఉత్తేజపరిచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయి అని అన్నారు. దాశరథి సోదరులు రచించిన పుస్తకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న దాశరధి గ్రంధాలయాన్ని, దాశరథులు నివసించిన ఇంటి ప్రాంగణాన్ని పరిశీలించారు. శాసనసభ్యులు, మంత్రి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సహకారంతో గ్రంధాలయ నిర్మాణ, మౌలిక సౌకర్యాల కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఎంపీపీ వల్లూరి పద్మా వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ వీరయ్య, మండల కోఆప్షన్ సభ్యులు మోసీన్ బేగ్, సర్పంచ్ మల్లయ్య, ఎమ్మార్వో రామకృష్ణా వరప్రసాద్, ఎంపీడీవో శ్యాం సుందర్, నాయకులు ధారాసింగ్, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love