ఎంఎంటీఎస్‌ రైళ్ల సంఖ్యను పెంచాలి

The number of MMTS trains should be increased– సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌
– రైల్‌ నిలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఓయూ
ఎంఎంటీఎస్‌ రైళ్ల సంఖ్యను పెంచుతూ సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో సామాన్యులు చౌకగా ప్రయాణించగలిగే ఎంఎంటీఎస్‌ రైళ్లు ప్రస్తుతం వారికి దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్ల సంఖ్య తగ్గిపోవడం, సమయపాలన లేకపోవడం, మరమ్మతుల పేరుతో రైళ్లు నిరంతరం రద్దవుతుండటం వల్ల ఎంఎంటీఎస్‌ ప్రయాణం పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని చెప్పారు. ఎంఎంటీఎస్‌ ఫేస్‌ 2కు సంబంధించి 4 రూట్లలో రోజుకు ఒక్కటి లేదా రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్యలో కూడా రోజుకు రెండు రైళ్లను మాత్రమే నడుపుతున్నారన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌కు త్వరగా గ్రీన్‌ సిగల్‌ ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్‌ రైళ్లు స్టేషన్‌ బయట చాలా సేపు ఆగాల్సి వస్తోందన్నారు.
ఎంఎంటీఎస్‌ రెండో దశ రూట్లతో కలుపుకొని రోజూ 5 లక్షల మందికిపైగా ప్రయాణించగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 40 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఎంఎంటీఎస్‌ రైళ్ల నిర్వహణలో తీవ్ర వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. దాంతో రెండో దశ అభివృద్ధి కోసం రూ.900 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నారని..కానీ, ఎంఎంటీఎస్‌లను సరిపడా వేసి రెగ్యులర్‌గా నడిపించకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
ఎంఎంటీఎస్‌ రైళ్ల సంఖ్యను పెంచాలని, రెండో దశలో నిర్మించిన రూట్లన్నింటిలో తగినన్ని రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి వర్గ సభ్యులు కేఎన్‌ రాజన్న, ఎం.మహేందర్‌, దశరథ్‌, వెంకటేష్‌, నాగలక్ష్మి, ఎం.అజరు బాబు, అశోక్‌, మారన్న, వరలక్ష్మి, ఫాతిమా, ఆరు మల్లేష్‌, టి.మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love