శెనగలతో గుగ్గిళ్లు (గుడాలు) చేసుకోవడం చాలా మందికి అలవాటు.. ఎక్కువ మంది రుచి కోసమో, సాయంత్రం ఏదొక స్నాక్‌లా కావాలని చేసుకున్నప్పటికీ అందులో అనేక పోషకాలు ఉంటాయి. ఉడికించడం లేదా వేయించుకోవడమే కాకుండా వీటితో ఇంకా వెరైటీలు చేసుకోవచ్చు. ఏదెలా ఉన్నా, స్నాక్‌లా మాత్రం మంచి ఆహారమనే చెప్పవచ్చు.
శెనగల్ని నానబెట్టి నీళ్లు ఒంపేసి వుంచితే ఒక రోజులో మొలకలు వస్తాయి. అప్పుడు వాటిని ఉడికించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వీటికి టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన కీర, పచ్చిమిర్చి, పుదీనా.. తగినంత ఉప్పు, ఇష్టం ఉన్న వారు చాట్ మసాలా కూడా వేసి నిమ్మకాయ పిండితే నోరూరించే సలాడ్ సిద్ధమైనట్టే..!
వీటితో పిల్లల కోసం టిక్కీలు కూడా ప్రయత్నించవచ్చు. అలాగే క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ లాంటి కూరల్లో బఠాణీలకు బదులు వీటిని వేసుకున్నా రుచిగా ఉంటుంది. ఇవేవీ కాదనుకుంటే ఏకంగా వాటితోనే కూర చేసుకోవచ్చు. ఎలా తిన్నా వీటి నుంచి పోషకాలు అందుతాయి.
శెనగల్లో పీచు పదార్థం సమద్ధిగా ఉంటుంది. అదే సమయంలో కొలెస్ట్రాల్ తక్కువ. కాబట్టి వీటిని కొద్దిగా తిన్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగువుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెరస్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
వీటిలో ఫొలేట్, మెగ్నీషియం స్థాయిలూ ఎక్కువే. ఫొలేట్ హోమోసి స్టీన్ అనే అమినోయాసిడ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దానివల్ల గుండెలోని రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గుతుంది. ఫోలేట్ వల్ల కొత్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
మహిళలకు మేలుచేసే పదార్థాల్లో శెనగలు ఒకటి. వీటిల్లో ఉండే ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లలా పని చేస్తాయి. ఇవి ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. రొమ్ముక్యాన్సర్ ప్రభావాన్నీ, మెనోపాజ్ తరువాత వచ్చే సమస్యల్నీ కొంతవరకూ అదుపులో ఉంచుతాయి.
రోజులో శరీరానికి అవసరమైన ఇనుములో చాలాశాతం శెనగల నుంచి పొందవచ్చు. వీటి వల్ల రక్తహీనత, అలసట, నిద్రలేమి, జుట్టురాలడం, తలనొప్పి వంటి వాటి బారిన పడకుండా ఉండొచ్చు.
కాబట్టి వీలైనంత వరకూ కనీసం వారంలో ఒకసారైనా శెనగలను స్నాక్ రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.