నవతెలంగాణ – ఖమ్మం: షెల్ ఇండియా మద్దతుతో, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ ను స్మైల్ ఫౌండేషన్ నిర్వహించింది. గ్రామీణ పాఠశాల పిల్లలకు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్)లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, జాతీయ స్థాయి విద్యా విధానం (NEP) 2020 కి అనుగుణంగా SDG లను (యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) అవగాహన చేసుకోవడానికి ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో ఈ రోజంతా కార్నివాల్ నిర్వహించబడింది. స్మైల్ ఫౌండేషన్ తెలంగాణలో వరంగల్, ఖమ్మం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ మరియు భద్రాద్రి కొత్తగూడెం వంటి ఎనిమిది జిల్లాల్లోని 116 ప్రభుత్వ పాఠశాలల్లో షెల్ యొక్క అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన సోషల్ ఇన్వెస్ట్‌మెంట్ స్టెమ్ ఎడ్యుకేషనల్ కార్యక్రమం అయిన ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ జూనియర్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఈ కార్నివాల్‌కు హాజరైన ప్రముఖులలో, టి . అంజలి, రీజనల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (RCO), MJP స్కూల్స్, పూర్వపు ఖమ్మం జిల్లా; చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ రాజ్ శేఖర్, ఖమ్మం జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీ డి జగదేశ్వర్ ఉన్నారు. తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 17 పాఠశాలలకు చెందిన 101 మంది విద్యార్థులు ఈ కార్నివాల్ సందర్భంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ ) విభాగాల్లో ఎంపిక చేసిన 31 ప్రాజెక్టులు, వినూత్న నమూనాలను ప్రదర్శించారు. రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (RCO) టి. అంజలి మాట్లాడుతూ.. “ఈ అద్భుతమైన కార్యక్రమం భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దటంతో పాటుగా ప్రపంచాన్ని స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు. చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్, రాజ్ శేఖర్ మాట్లాడుతూ.. “సంక్లిష్ట సమస్యను పరిష్కరించిన ఒక చిన్న ఆలోచన కూడా శతాబ్దాల పాటు గుర్తుండిపోతుంది. వినూత్న ఆలోచనలపై దృష్టి సారించే ఎన్‌ఎక్స్‌ప్లోరర్స్ ప్రోగ్రామ్ పిల్లలు అన్ని అంశాలలో ఎదగడానికి సహాయపడుతుంది” అని అన్నారు. ఖమ్మం జిల్లా సైన్స్ అధికారి డి.జగదేశ్వర్ మాట్లాడుతూ.. ప్రతి సమస్యకు ప్రకృతి మాత పరిష్కారం చూపుతుంది. సమాజంలో స్థిరమైన పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి, విజ్ఞాన శాస్త్రాన్ని జీవన విధానంగా అంగీకరించాలి” అని అన్నారు.