తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీల ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యులుగా తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ హౌస్‌లోని రాజ్యసభ ఛాంబర్‌లో చైర్మెన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ వారి చేత సోమవారం ప్రమాణం చేయించారు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన వారిలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ ఉన్నారు. రాజ్యసభ ఎంపీగా ఆయనకు ఇది రెండోసారి. ఆయన 2019లో తొలిసారిగా ఎన్నికయ్యారు. జై శంకర్‌తో పాటు, ప్రమాణం చేసిన ఇతర బీజేపీ సభ్యులు బాబూభారు జెసంగ్‌భారు దేశారు (గుజరాత్‌), కేశ్రీదేవ్‌సింగ్‌ దిగ్విజరుసింగ్‌ ఝాలా (గుజరాత్‌), నాగేంద్ర రే (పశ్చిమ బెంగాల్‌) ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. డెరెక్‌ ఓబ్రెయిన్‌, డోలా సేన్‌, సుఖేందు శేఖర్‌ రారు, ప్రకాష్‌ చిక్‌ బరైక్‌, సమీరుల్‌ ఇస్లాం కూడా ప్రమాణం చేశారు. తొమ్మిది మంది సభ్యులలో ఐదుగురు కొత్తగా ఎన్నికయ్యారు. నాగేంద్ర రే, ప్రకాష్‌ చిక్‌ బరాక్‌, సమీరుల్‌ ఇస్లాం, కేశ్రీదేవ్‌సింగ్‌ దిగ్విజరుసింగ్‌ ఝాలా, బాబూభారు జెసంగ్‌భారు దేశారు కొత్తగా ఎన్నిక అయ్యారు.

Spread the love