– ఎస్సీలు 19, అగ్ర కులాలు 15.52శాతం
– కులాల లెక్కలు విడుదల చేసిన నితీశ్ సర్కార్
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏండ్ల ప్రజల డిమాండ్‌ను నెరవేర్చింది. కులాల వారీగా లెక్కల్ని బయటకు తీసింది. ఇందుకు సంబంధించిన జనాభా లెక్కల సర్వే రిపోర్టును బీహార్ రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ సోమవారం విడుదల చేశారు. ఇందులోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వారిలో ఓబీసీలు మొదటి స్థానంలో ఉన్నారు. 13 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో ఓబీసీలు 63శాతంగా ఉన్నారు. ఎస్సీలు 19.7శాతం, ఎస్టీలు 1.68శాతంగా ఉన్నారు. అగ్ర కులాలు(సవర్ణలు) 15.52శాతంగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలు 27.13శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన వారు 36 శాతం ఉన్నారు. రాజకీయాలను శాసించే స్థాయిలో ఓబీసీలు ఉన్నారని ఆ సర్వే స్పష్టం చేస్తున్నది.
జనాభాలో భూమిహార్లు 2.86 శాతం ఉండగా, బ్రాహ్మణులు 3.66 శాతం, కుర్మీలు (నితీష్ కుమార్ సామాజిక వర్గం) 2.87 శాతం ఉన్నారు. ముసహర్‌లు 3 శాతం, యాదవులు(ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సామాజిక వర్గం) 14.27 శాతం ఉన్నారు. ఈ సర్వేపై చట్టపరమైన అడ్డంకులు, బీజేపీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న సీఎం నితీశ్ కుమార్, అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ నివేదిక దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. కులగణన నివేదిక నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఉదయం మీడియాతో అన్నారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు. తాజా కుల గణన నివేదికపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా స్పందించారు. ఇది చరిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం కుల సర్వేలు విడుదల చేసిందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఈ సర్వే కీలకమని బీహార్ ప్రభుత్వం పేర్కొంది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, కులగణను వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.