జాతరకు అడ్డంకులు..!

Obstacles to the fair..!– నిలిచిన వరంగల్‌-గట్టమ్మ జాతీయ రహదారి, బ్రిడ్జి పనులు
– మేడారం చేరాలంటే తప్పని ట్రాఫిక్‌ ఇబ్బందులు
– రోజూ వందలాది వాహనాల రాకపోకలు
– అధికారుల్లో టెన్షన్‌.. రద్దీ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం జాతర విజయవంతం కావాలంటే ప్రధానంగా ట్రాఫిక్‌ రద్దీ లేకుండా చూడడమే కీలకం. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జాతర జరిగే ప్రాంతానికి చేరాలంటే అనేక కాల్వలు, గుట్టలు దాటి రావాల్సిందే. వాటన్నింటినీ అధిగమించడానికి వరంగల్‌-ములుగు మధ్య జాతీయ రహదారి 163పై రూ.314 కోట్లతో 2022లో దామెర క్రాస్‌ రోడ్డు నుంచి గట్టమ్మ (ములుగు) గుడి వరకు 36 కి.మీ మేర 4 లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దాన్ని 2024 జులైలోపు పూర్తి చేయాల్సి ఉందని జాతీయ రహదారి అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో 2 బ్రిడ్జిలు, 9 మైనర్‌ బ్రిడ్జిలు, 46 కల్వర్టుల నిర్మాణం చేయాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు 24 కి.మీ మేరకు కాగా, మరో 6 కి.మీ పనులతో పాటు 7 మైనర్‌ బ్రిడ్జిలు, 10 కల్వర్టుల పనులూ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పట్లో ఆ పనులు జరిగేలా లేకపోవడంతో జాతరకు ట్రాఫిక్‌ ఇబ్బందులతో పోలీసు అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాంతో జాతర సమయంలో రద్దీ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరుకుగా వున్న జాకారం మూలమలుపును మంత్రి సీతక్క, ములుగు ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ఆదేశాల మేరకు రోడ్డును వెడల్పు చేశారు.
2 బ్రిడ్జిల రీ డిజైనింగ్‌..
జాతీయ రహదారి 163పై నీరుకుళ్ల వద్ద ఉన్న బ్రిడ్జి, కటాక్షపూర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను ఈ నిధుల్లోనే చేయాల్సి ఉంది. వీటి నిర్మాణం వల్ల పలు ఇండ్లు దెబ్బతినడంతోపాటు పక్కనున్న భూములు ముంపునకు గురికానున్నాయి. అంతేకాకుండా కటాక్షపూర్‌ వద్ద హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణంతో సింగారం గ్రామానికి వెళ్లే రహదారి బంద్‌కానుంది. దాంతో ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి మళ్లీ కొత్త డిజైన్‌లను రూపొందించి ప్రభుత్వం ఆమోదం కోసం పంపించడంతో ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నీరుకుళ్ల బ్రిడ్జి మూలమలుపు వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ పనులు పూర్తికాకపోవడంతో అధికారులు ఈ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాల్సి ఉంది.
పెండింగ్‌లో 7 మైనర్‌ బ్రిడ్జిలు, 10 కల్వర్టులు..
163 జాతీయ రహదారిపై కల్వర్టులు, మైనర్‌ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో మేడారం జాతరకు ట్రాఫిక్‌ ఇబ్బందికరంగా మారింది. వీటి నిర్మాణం జాతర ముగిశాకే ప్రారంభించే అవకాశముంది. మైనర్‌ బ్రిడ్జిల్లో.. ఒగ్లాపూర్‌ సైలానిబాబా దర్గా, ఊరుగొండ, పసరగొండ, ఎన్‌ఎస్‌ఆర్‌ హౌటల్‌, నీరుకుళ్ల, మల్లంపల్లి, జాకారం, గట్టమ్మ గుడి వద్ద ఉన్న 2 మైనర్‌ బ్రిడ్జిల నిర్మాణం పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, 46 కల్వర్టులను వెడల్పు చేసి బీటీ రోడ్డు వేయాల్సి ఉండగా.. ఇందులో 10 కల్వర్టుల నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.
రహదారికి ఇరువైపులా కల్వర్టులు నిర్మించి మధ్యలో నుంచి రాకపోకలు సాగుతుండటంతో కల్వర్టుల పనులను పూర్తి చేయలేదు. ఈ కల్వర్టులను వెడల్పు చేయడంతోపాటు ఎత్తు పెంచి నిర్మించారు. మధ్యలో నుంచి రాకపోకలు సాగించే క్రమంలో వాహనదారులు ఓవర్‌టెక్‌ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే ఎత్తుగా ఉన్న కల్వర్టులకు ఢకొీని ప్రమాదాలు జరిగే అవకాశమూ లేకపోలేదు. మల్లంపల్లి వద్ద 1, కటాక్షాపూర్‌ వద్ద 1, జాకారం వద్ద 6, గట్టమ్మ వద్ద 2 కల్వర్టులు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
అప్రమత్తమైన అధికారులు
జాతీయ రహదారి 163పై జరుగుతున్న 4 లైన్ల రహదారి పనులు పూర్తి కాకపోవడంతో సమస్యాత్మక ప్రాంతాలపై ములుగు ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ఫోకస్‌ చేశారు. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసు సిబ్బం దిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Spread the love