నవతెలంగాణ – భువనేశ్వర్
అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిత్యం తపిస్తుంటారని, గతంలో పూరీలో అభివృద్ధి పనుల కోసం తన తండ్రి బిజు పట్నాయక్ (బిజుబాబు) సమాధిని తొలగింపజేశారని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన 5టి కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్ తెలిపారు. దుబాయ్లో బుధవారం నిర్వహించిన ఒడిశా దివస్ వేడుకల్లో పాండ్యన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం నవీన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పూరీ మహా ప్రస్థానం ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొన్నేళ్ల క్రితం బిజుబాబు సమాధిని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేసే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సీఎం వెనుకాడరని అన్నారు. పూరీ మహాప్రస్థానం ఆధునికీకరణ పనులకు అడ్డంగా ఉన్న తండ్రి సమాధిని తొలగించాలని అధికారులను సీఎం ఆదేశించారని ఈ సందర్భంగా పాండ్యన్ గుర్తు చేసుకున్నారు.
2019లో పూరీలోని ‘స్వర్గద్వార్’లో మరింత స్థలం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తన తండ్రి బిజు పట్నాయక్ సమాధిని కూడా తొలగించాలని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బిజూ పట్నాయక్ మృతి తర్వాత 17 ఏప్రిల్ 1997లో స్వర్గద్వార్లో భారీ సమాధిని నిర్మించారు. అయితే, దీని వల్ల అక్కడున్న స్థలం తగ్గిపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో దానిని తొలగించాలని సీఎం స్వయంగా ఆదేశించినట్టు పాండ్యాన్ తెలిపారు.