రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లే ఒడిశా రైలు ప్రమాదం

రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లే ఘోర రైలు ప్రమాదం

నవతెలంగాణ హైదరాబాద్: ఒడిశాలో గత నెలలో జరిగిన రైలు దుర్ఘటనకు గల కారణాలను విచారణ కమిటీ వెల్లడించింది. రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లే ఈ ఘోరం చోటుచేసుకుందని తేల్చింది. దీంతోపాటు అనేక స్థాయిల్లో లోపాలు ఉన్నట్టు గుర్తించిన రైల్వే సేఫ్టీ కమిషన్‌.. తన దర్యాప్తు నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. గతంలో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని ఉంటే ఈ రైలు ప్రమాదం జరిగిఉండేది కాదని అభిప్రాయపడింది. రాంగ్‌ వైరింగ్‌, రాంగ్‌ కేబుల్‌ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పూర్‌ డివిజన్‌లోనూ చోటుచేసుకుందని నివేదిక తెలిపింది. అప్పుడే దాన్ని సరిచేసే చర్యలు చేపట్టి రాంగ్‌ వైరింగ్‌ సమస్యను పరిష్కరించి ఉంటే ఒడిశాలోని బహనాగా బజార్‌ వద్ద ఈ రైలు దుర్ఘటన చోటుచేసుకొని ఉండేది కాదని తెలిపింది. సిగ్నలింగ్‌, సర్క్యూట్‌ మార్పులో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది.
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జూన్‌ 2న రాత్రి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ సహా మూడు రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొన్న ఘటన దేశ వ్యాప్తంగా పెను విషాదం నింపిన సంగతి తెలిసిందే. రైలు దుర్ఘటనలో అధికారిక లెక్కల ప్రకారమే 292మంది మరణించగా, మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై కుట్ర కోణం ఆరోపణలు రావడంతో రైల్వే బోర్డు సిఫారసు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే, తొలుత రైల్వే సేఫ్టీ కమిషన్‌ విచారణ జరపడంతో ఆ కమిటీ విచారణను పూర్తి చేసి నివేదికను రైల్వే బోర్డుకు తాజాగా సమర్పించింది.

Spread the love