నవతెలంగాణ హైదరాబాద్: ఈ ఏడాది మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు చెందిన తృష్ణా రే దక్కించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఇందులో పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నమీబియా, నెదర్లాండ్స్‌తో సహా వివిధ దేశాలకు చెందిన మోడళ్లు పాల్గొన్నారు. వీరందరినీ వెనక్కినెట్టి మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని 19 ఏండ్ల తృష్ణా రే సొంతం చేసుకున్నారు.
పెరూకు చెందిన అన్నే థోర్సెన్, నమీబియాకు చెందిన ప్రెషియస్ ఆండ్రీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఒడిశాకు చెందిన తృష్ణా రే కల్నల్ దిలీప్ కుమార్ రే, రాజశ్రీ రేల కుమార్తె. ప్రస్తుతం భువనేశ్వర్‌లో కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన మిస్ టీన్ యానివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన ఈమె తాజాగా అంతర్జాతీయ వేదికగా జరిగిన పోటీలోనూ విజయం సాధించారు. ఈ పోటీలకు సంబంధించిన వీడియోను నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. పలువురు నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.