ఏఐతో అత్యంత ప్రమాదంలో 27% ఉద్యోగాలు : ఓఈసీడీ సర్వేలో వెల్లడి

JOB LOSS
JOB LOSS

న్యూఢిల్లీ : కృత్రిమ మేథా (ఏఐ)తో నాలుగింట ఒక్క వంతు ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని ది ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) తెలిపింది. ఏఐతో ఇప్పటికే పలు ఉద్యోగాలపై ప్రభావం పడిందని.. ఇది మరింత పెరగనుందని విశ్లేషించింది. రాబోయే రోజుల్లో ఎఐతో భారీ సంఖ్యలో కొలువుల కోత తప్పదనే అభిప్రాయాలు ఓఈసీడీ సర్వేలో వ్యక్తం అయ్యాయి. ఏడు దేశాల్లోని 2,000 సంస్థలలో 5,300 మంది కార్మికులను ఈ సర్వేలో భాగస్వామ్యం చేసింది. నూతన టెక్నాలజీతో 27 శాతం ఉద్యోగులకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయమై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 38 దేశాలతో కూడిన ఓఈసీడీలో సంపన్న దేశాలతో పాటు మెక్సికో వంటి ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధలు కూడా సభ్యులుగా ఉన్నాయి. కొలువుల ప్రమాదం కంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయా అనేది మనం తీసుకునే విధానపరమైన చర్యలపై ఆధారపడి ఉంటుందని ఓఈసీడీ సెక్రెటరీ జనరల్‌ మధీస్‌ కార్మన్‌ పేర్కొన్నారు. ఏఐ ద్వారా అందివచ్చే ప్రయోజనాల కోసం మార్పులకు అనుగుణంగా కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వాలు సిద్ధం చేయాలని సూచించారు. కార్మికులు, తక్కువ నైపుణ్యంతో కూడిన ఉద్యోగులకు ఏఐ టెక్నాలజీతో ముప్పు అధికంగా ఉందన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో ఐదుగురు కార్మికులలో ముగ్గురు ఏఐ వల్ల తమ ఉద్యోగాన్ని కోల్పోతారని ఓఈసీడీ సర్వేలో వెల్లడయ్యింది. ఇంతక్రితం రోజు స్టార్టప్‌ సంస్థ దుకాన్‌ తమ ఉద్యోగుల్లో 90 శాతం మందికి ఉద్వాసన పలికింది. వీరి స్థానంలో కృత్రిమ మేథా(ఏఐ)ని ఉపయోగించుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Spread the love