అవతరణోత్సవానికి అధికారిక గుర్తింపు

Official recognition of the Incarnation– గవర్నర్‌ ఆమోదం జీవో జారీ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్‌ 1946 జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతియేటా డిసెంబర్‌ 9న రాష్ట్ర, జిల్లా మండల ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం ఆ జీవోలో పేర్కొన్నది. ”బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులు, శ్రమించే జీవనశైలి, భావితరాలకు స్ఫూర్తి కలిగించే చిహ్నంగా ‘తెలంగాణ తల్లి’ ఉండాలని ప్రభుత్వం విగ్రహాన్ని రూపొందించింది” అని ఉత్తర్వులో పేర్కొన్నారు. ”సాంప్రదాయ స్త్రీమూర్తిగా, ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, కట్టుబొట్టుతో, మెడకు కంఠె, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్య వయస్సు స్త్రీమూర్తిలా, కుడిచేతితో అభయాన్నిస్తూ, ఎడమచేతిలో వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలతో తెలంగాణ తల్లిని రూపొందించాం” అని ప్రభుత్వం పేర్కొన్నది. ”మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ తల్లి. చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం గానీ, వేరేవిధంగా చూపించడం గానీ నిషేధించడమైనది. బహిరంగ ప్రదేశాల్లో గానీ, ఇతర ప్రదేశాల్లో గానీ, ఆన్‌ లైన్‌లోగానీ, సామాజిక మాధ్యమాల్లో గాని, మాటలు లేక చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించబడుతుంది” అని ఉత్తర్వులో వివరించారు. తెలంగాణ తల్లిని అధికారికంగా గుర్తిస్తూ తెలుగులో జీవో ఇవ్వడం గమనార్హం.

Spread the love